న్యూఢిల్లీ: కర్నాటక ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న జెడిఎస్ లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపితో కూటమికోసం యత్నిస్తోంది. ఇరుపార్టీల నడుమ వియ్యం కొత్తదేమీ కాదు. గతంలో ఓ దశలో నెలకొని ఉన్నదే. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపితో తలపడేందుకు ప్రతిపక్షాలు ముమ్మర యత్నాలకు దిగుతున్న క్రమంలోనే దేవేగౌడ సారధ్యపు జెడిఎస్ ఇప్పుడు మోడీ వైపు మొగ్గు సంకేతాలు వెలువరించడం కీలక పరిణామం అయింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కర్నాటకలో జెడిఎస్‌కు ఒకే ఒక్క స్థానం దక్కింది.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అయిన దశలో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలనే సంకేతాలను జెడిఎస్ వెలువరించిందని వెల్లడయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో 224 సీట్లలో జెడిఎస్‌కు కేవలం 19 స్థానాలు వచ్చాయి. దీనితో జెడిఎస్ ఇంతకు ముందటి కింగ్‌మేకర్ స్థానం కూడా పోగొట్టుకుని చివరకు కేవలం తన ఉనికిని నిలబెట్టుకున్న స్థితికి చేరింది. పార్టీ నేత కుమారస్వామి ఇప్పుడు తమ ఓట్ల రక్షణకు తండ్రి, పార్టీ పెద్ద దిక్కు అయిన దేవెగౌడ సూచనలతోనే బిజెపి వైపు స్నేహహస్తానికి ముందుకు కదులుతున్నట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి.
2006లో ఈ కాంగ్రెస్ కంచుకోట రాష్ట్రంలో బిజెపితో చేతులు కలిపి జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. అప్పట్లో కుమారస్వామి సిఎంగా, బిజెపి నేత యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 20 నెలల పాటు అధికార పంపిణీ ఫార్మూలాతో సాగారు. తరువాత ఈ పార్టీల మధ్య బెడిసికొట్టింది. ఇప్పుడు రాజకీయ అనివార్యంగా జెడిఎస్ తన పాతరూట్లో వెళ్లుతుందనే సంకేతాలు బలోపేతం అయ్యాయి. ఇటీవలే ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు దేవేగౌడ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మద్దతుగా ప్రకటన వెలువరించారు. ప్రమాదాలు జరుగుతాయి. అయితే తరువాత క్రమంలో రైల్వే మంత్రి స్పందన బాగుందని ఈ నేత కొనియాడారు. ఇదంతా కూడా బిజెపిని ప్రసన్నం చేసుకోవడానికే అనే ప్రచారం జరుగుతోంది.