Sunday, January 19, 2025

బయటపడుతున్న ఇండియా కూటమి లుకలుకలు

- Advertisement -
- Advertisement -

నితీశ్‌కు సారథ్యం అప్పగించాలని పెరుగుతున్న డిమాండ్

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమికి సారథ్యం వహించే విషయంలో ఆ కూటమిలో ఏర్పడిన లుకలుకలు క్రమంగా బయటపడుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి కన్వీనర్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్‌ను కొందరు వినిపిస్తుండగా నితీశ్‌కు తీసిపోని నాయకులు పలువురు కూటమిలో ఉన్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

తాజాగా జెడియు నాయకుడు రాంనాథ్ ఠాకూర్ బుధవారం ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీశ్ కుమార్ పేరును ప్రకటించాలని డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ప్రతిపక్ష కూటమికి కన్వీనర్‌గా ఆయన ఉండే అర్హత ఆయనకు ఉందని రాజ్యసభ సభ్యుడైన రాంనాథ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. బీహార్‌లో నితీశ్ కుమార్ మచ్చలేని నాయకుడిగా ఎదిగారని, ఆయన కన్వీనర్‌గా ఉండడం ఇండియా కూటమికే ఎంతో మేలు చేస్తుందని ఠాకూర్ అభిప్రాయపడ్డారు. కాగా..ఠాకూర్ వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ఎఎంపి సంజయ్ రౌత్ స్పందిస్తూ ఇండియా కూటమి సమావేశంలో ఎప్పుడూ ఈ మేరకు ఎవరి నుంచి ప్రతిపాదన రాలేదని చెప్పారు.

అటువంటి డిమాండ్ వస్తే ఇండియా కూటమి సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు. నితీశ్ కుమార్ చాలా పెద్ద నాయకుడనడంలో ఎటువంటి సందేహం లేదని, ఆయన మార్గదర్శనం ఇండియా కూటమికి ఉంటుందని రౌత్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ నాయకుడు ఉద్ధవ్ థాక్రే పేరును కూడా రౌత్ ప్రస్తావించారు. ఉద్ధవ్ థాక్రేను దేశవ్యాప్తంగా జనామోదం గల నేతగా ఆయన అభివర్ణించారు. ఆయనకు ఈ పదవి లేదా ఆ పదవి ఇవ్వాలని తాను చెప్పబోనని, అయితే కరడుగట్టిన హిందూత్వవాది అయినప్పటికీ ఎంతో ఉదారవాదిగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్లగల నాయకుడిగా ఉద్ధవ్‌ను ఆయన వర్ణించారు.

ఇదిలా ఉంటే..ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షమైన సిపిఎంపై మరో ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కె సురేష్ విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై కేరళ సిపిఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేరళలో తాము బిజెపితోపాటు సిపిఎంతో కూడా పోరాడుతున్నామని ఆయన అన్నారు. కేరళలో తప్పిస్తే సిపిఎం ఎక్కడా బలంగా లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యానించే నైతిక హక్కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేదని ఆయన విమర్శించారు. తాము మూడు రాష్ట్రాలలో ఓడిపోయినప్పటికీ తమ ఓటు శాతం ఏమాత్రం తగ్గలేదని ఆయన చెప్పుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News