జూలై 3న జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష
75 మార్కులు తప్పనిసరి నిబంధన ఈసారి కూడా సడలింపు
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటిల్లో బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష 2021 తేదీని కేంద్ర విద్యాశాఖమంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జూలై 3వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈసారి ఐఐటి ఖరగ్‌పూర్ పరీక్షను నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. గురువారం వర్చువల్ విధానంలో మాట్లాడిన మంత్రి.. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు 75 శాతం మార్కులు తప్పరిసరి నిబంధనను ఈసారి కూడా సడలిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
మే 28తో ముగియనున్న నాలుగవ జెఇఇ మెయిన్
జెఇఇ మెయిన్ పరీక్షలను ఈసారి నాలుగు విడతల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నాలుగు విడత పరీక్షల తేదీలు ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జెఇఇ మెయిన్ నిర్వహించనుండగా, మార్చి 15 నుంచి 18 రెండవది, ఏప్రిల్ 27 నుంచి 30 మూడవ, మే 24 నుంచి 28 వరకు నాలుగవ జెఇఇ నిర్వహించనున్నారు. చివరి జెఇఇ మెయిన్‌లో పరీక్షలు మే 28తో ముగియనున్నాయి. ఈ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే జెఇఇ అడ్వాన్స్‌డ్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నారు. అలాగే మే 4 నుంచి జూన్ 10 వరకు సిబిఎస్‌ఇ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్ర మంత్రి వెల్లడించారు.
2020 అభ్యర్థులకు మరో అవకాశం
జెఇఇ అడ్వాన్స్‌డ్- 2020లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని సంబంధిత జాయింట్ అడ్మిషన్ల బోర్డు(జెఎబి) నిర్ణయించింది. కోవిడ్-19 కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన, అడ్వాన్స్‌డ్‌కు సరైన సన్నద్ధత లేక సఫలం కాలేకపోయిన వారికి 2021లో జరిగే జెఇఇ అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారరు. జెఇఇ అడ్వాన్స్‌డ్-2021కు ఈ అభ్యర్థులు 2020 మెయిన్స్ అర్హతతోనే హాజరుకావచ్చు. వీరు 2021 జెఇఇ మెయిన్స్‌ను రాయాల్సిన అవసరం లేదు. కేవలం 2020 జెఇఇ అడ్వాన్స్‌డ్ అభ్యర్థులకు మాత్రమే ఇది పరిమితం. కేవలం ఒక్క అవకాశం మాత్రమే ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని జాయింట్ అడ్మిషన్ల బోర్డు అర్హత నిబంధనల నుంచి వీరికి సడలింపు ఇచ్చింది. కోవిడ్-19 పాజిటివ్ వచ్చి అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు, సఫలం కాలేకపోయిన వారికి సమానావకాశాలిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఏటా నమోదిత విద్యార్థులలో నాలుగింట ఒక వంతు మంది ఆ పరీక్షకు హాజరు కావడం లేదు. 2021 అడ్వాన్స్‌డ్‌కు అవకాశం పొందిన అభ్యర్థులను అదనపు అభ్యర్థులుగా పరిగణిస్తారు. 2021 జెఇఇ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి సంఖ్యకు వీరు అదనం. అర్హతలు, వయసు, ఇతర అంశాల్లో కూడా వీరికి సడలింపు ఉంటుంది. జెఇఇ అడ్వాన్స్‌డ్-2020కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా, వారిలో 1.50 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
JEE Advanced 2021 Exam to conduct on July 3