మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీ, మెరిట్ జాబితాను ఐఐటీ ముంబై ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఫలితాలను www.jeeadv.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.గత నెల 28వ తేదీన నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,60,038 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా, అందులో 1,55,538 మంది హాజరయ్యారు. మొత్తం 40,712 మంది విద్యార్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు. ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ఆర్.కె శిశిర్ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. 360 మార్కులకు గాను.. శిశిర్ 314 మార్కులు సాధించారు. అదే సమయంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన తనిష్క కబ్రా మహిళల విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు. కబ్రా 360 మార్కులకు 277 మార్కులు సాధించారు.
ఐఐటీ బాంబేలో చేరాలనుకుంటున్నా: ఆలిండియా టాపర్ శిశిర్
ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీలో చేరాలనేది తనకు డ్రీమ్‌గా ఉండేదని, కంప్యూటర్ సైన్స్ కోర్సు అభ్యసించేందుకు తాను ఐఐటీ బాంబేలో చేరాలనుకొంటున్నానని జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా టాపర్‌గా నిలిచిని ఆర్.కె.శిశిర్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ ఎంటర్‌ప్రిన్యూర్‌గా సమాజానికి సేవ చేయాలనుకొంటున్నానని తెలిపారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష కోసం తాను 11వ తరగతి నుంచి సీరియస్‌గా ప్రిపరేషన్ ప్రారంభించానని, ప్రతివారం తమ పాఠశాలలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యానని చెప్పారు. తనకు రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించడం ఎంతో ఇష్టం అని, అది కూడా తన ఆలోచనా నైపుణ్యాలను పెంచిందని అన్నారు. తన లాజికల్ థింకింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు.
JEE Advanced 2022 Results Released