త్వరలో షెడ్యూల్ వెల్లడి
ఈసారి అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తున్న ఐఐటీ ముంబయి
హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) అడ్వాన్స్‌డ్‌ను ఈ ఏడాది ఐఐటీ ముంబయి నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐఐటీ ముంబయి ఇటీవల జెఇఇ అడ్వాన్స్‌డ్ 2022 కోసం ప్రత్యకంగా వెబ్‌సైట్‌ను ఐఐటీ ముంబాయి ప్రారంభించింది. కాగా, ఈ ఏడాది జరగనున్న జెఇఇ మెయిన్ 2022,జెఇఇ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. జెఇఇ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరవడానికి అర్హులు. గత ఏడాది నుంచి నాలుగుసార్లు జెఇఇ మెయిన్ నిర్వహించగా, ఈ ఏడాది రెండు సార్లు నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ప్రాథమికంగా నిర్ణయించింది.
వరుసగా ఏప్రిల్, మే నెలల్లో జెఇఇ మెయిన్ పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మెయిన్స్ ఫలితాలు వెలువడిన తర్వాత అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత సాధిస్తారు. కొవిడ్ కారణంగా జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు హాజరుకాలేకపోయిన అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో జెఇఇ అడ్వాన్స్‌డ్ 2022 కోసం కచ్చితంగా నమోదు చేసుకుని, గా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈ అభ్యర్థులు జెఇఇ మెయిన్ 2022లో అర్హత సాధించిన వారికి అదనంగా పరిగణించబడతారని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షను గత ఏడాది ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించగా, ఈ ఏడాది ఐఐటీ ముంబాయి నిర్వహించనుంది.