ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 మూడుసార్లు రాసుకోవచ్చని ప్రకటించి.. ఆ తర్వాత రెండుసార్లకే పరిమితం చేయడంపై పలువురు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను రెండుసార్లు రాసేలా జేఏబీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అలాగే ఐఐటీ కాన్పూర్ ప్రకటన నేపథ్యంలో 2024 నవంబర్ 518 తేదీల మధ్య కాలంలో తమ కోర్సుల నుంచి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులకు ఉపశమనం కలిగించింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు వారు రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను మూడుసార్లు రాసే అవకాశం కల్పిస్తున్నట్టు నవంబర్ 5న ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది. ఆ తర్వాత 18 వ తేదీన జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ )యూటర్న్ తీసుకోవడంతో పలువురు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల అర్హత ప్రమాణాల్లో చేసిన ఆకస్మిక మార్పులు పిటిషనర్లతో పాటు ఇలాంటి వేలాది మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశించేందుకు విలువైన అవకాశాన్ని ప్రభావితం చేస్తాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పేరిట పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానికి ఇంటర్ పాసైన సంవత్సరంతోపాటు ఆ తర్వాత ఏడాది , అంటే వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరు కావొచ్చు. దాన్ని మూడుసార్లకు పెంచుతూ జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పూర్ గత ఏడాది నవంబరు 5వ తేదీన ప్రకటించింది. పట్టుమని 15 రోజులు కాకముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసుకోవచ్చు. వచ్చే మే నెలలో జరిగే అడ్వాన్స్డ్ పరీక్షకు 2024 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్షల్లో పాసైన వారు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు ఉత్తీర్ణులైన వారికి అవకాశం ఉండదు.