హైదరాబాద్ : మార్చి విడత జెఇఇ మెయిన్ ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) విడుదల చేసింది. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 మధ్యాహ్నం 1 గంట వరకు https://jeemain.nta.nic.in ద్వారా సవాల్ చేయవచ్చునని ఎన్‌టిఎ తెలిపింది. ప్రాథమిక కీ పై ఏమైనా అభ్యంతరాలు గుర్తించిన విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు తెలపాలని పేర్కొంది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది కీ విడుదల చేసి వెంటనే స్కోర్ విడుదల చేయనున్నారు. ఈనెల 16,17,18 తేదీలలో జరిగిన రెండవ విడత జెఇఇ మెయిన్ పేపర్- 1 పరీక్షకు 6,19,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్‌లో జరుగనున్న జరగనున్న మూడవ విడత జెఇఇ మెయిన్ పరీక్షలకు త్వరలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. గతంలో దరఖాస్తు చేసిన వారు ఉపసంహరించుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించనున్నారు.