Sunday, December 22, 2024

రెండు మూడు రోజుల్లో సెట్ తేదీలు ఖరారు..?

- Advertisement -
- Advertisement -

వచ్చే వారంలో నోటిఫికేషన్లు…జూన్‌లో పరీక్షలు

JEE Main Advanced Schedule

 

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలు రెండు మూడు ఖరారయ్యే అవకాశాలున్నాయి. జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్ షెడ్యూల్‌తో పాటు ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో త్వరలోనే ఉన్నత విద్యామండలి ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయనుంది. సెట్స్‌కు సంబంధించి ఈ నెలలోనే నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో జూన్‌లో ఎంసెట్, ఇసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు తెలిసింది.

ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ జూన్ నెలలో నిర్వహించి జూలైలో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా జూన్ మొదటి వారంలో ఇసెట్ నిర్వహించి ఆ తర్వాత ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) నిబంధనలకు అనుగుణంగా సెట్స్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఆలస్యంగా ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం

కొవిడ్- 19 పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు ఆలస్యంగా జరగడంతో పాటు తరగతులు కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా జూన్‌లో ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే జూలై లేదా ఆగస్టులో కౌన్సెలింగ్ జరుగనుంది. ఆగస్టు చివరి నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తయితే సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News