Tuesday, November 5, 2024

మొదటి విడత జెఇఇ మెయిన్‌కు హాజరు తగ్గే అవకాశం

- Advertisement -
- Advertisement -

ప్రిపరేషన్‌కు తగిన సమయం లేకపోవడమే కారణం
ఇంటర్ పరీక్షలపైనే విద్యార్థులు దృష్టి

JEE Main attendance decreased

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలకు రాష్ట్రంలో విద్యార్థుల హాజరు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతకు హాజరైన రెండో విడత పరీక్షలకే సీరియస్ ప్రిపేరై హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా, ఈ నెల 22వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి. అయితే జాతీయస్థాయిలో నిర్వహించే జెఇఇ మెయిన్‌కు విద్యార్థులు సీరియస్‌గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు సరైన సమయం లేనందున మొదటి విడతకు దరఖాస్తు చేసుకున్నా, హాజరు కాకపోవచ్చని లేదా హాజరైనా సీరియస్‌గా రాయలేకపోవచ్చని పలువురు నిపుణలు పేర్కొంటున్నారు.

కరోనా కారణంగా తరగతులు సరిగ్గా జరగకపోవడంతో ఇంటర్ బోర్డు ఈసారి కూడా సిలబస్‌ను 30 శాతం తగ్గించింది. అయితే జెఇఇ మెయిన్ సిలబస్‌ను మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యథాతథంగానే ఉంచింది. దీంతో విద్యార్థులు జెఇఇ మెయిన్ సిలబస్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి వస్తోంది. ఇంటర్ పరీక్షల తర్వాత జెఇఇ మెయిన్ తొలి పరీక్షలు జరుగనున్నాయి. ప్రస్తుతం విద్యార్థులు పూర్తిగా ఇంటర్ పరీక్షలపైనే దృష్టి సారిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాతనే జెఇఇ మెయిన్ సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభించే అవకాశాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

కొవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరంలో కూడా ఆలస్యంగా తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంటర్ సిలబస్‌ను పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం కావడానికే విద్యార్థులకు సమయమంతా సరిపోతోందని, జెఇఇ మెయిన్ ప్రిపరేషన్‌కు అదనపు సమయం అవసరమవుతోందని అంటున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో జెఇఇ మెయిన్ తొలివిడత పరీక్షలకు విద్యార్థులు పూర్తిగా సంసిద్ధం కాలేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలివిడత పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆశించిన స్థాయిలో స్కోర్ పొందలేకపోవచ్చని పేర్కొంటున్నారు. జూలై 21 నుంచి 30 వరకు నిర్వహించే రెండో విడత జెఇఇ మెయిన్ పరీక్షలకు విద్యార్థులు పూర్తిగా సంసిద్ధంగా ఉంటారని చెబుతున్నారు.

చివరి వారంలో హాల్‌టికెట్లు

జెఇఇ మెయిన్ తొలి విడత హాల్ టికెట్లు ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల వారంలో వెబ్‌సైట్‌లో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News