Sunday, January 5, 2025

జూన్‌లో తొలి విడత జెఇఇ మెయిన్..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్ష జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. జూలైలో రెండో విడత నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జెఇఇ మెయిన్ 2023 తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ముందుగా భావించినా జనవరిలో మొదటి విడత నిర్వహించొద్దంటూ విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని జూన్‌లో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొదటి విడత పరీక్షను జనవరిలో నిర్వహించొద్దంటూ సోషల్ మీడియా వేదికగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు.

జనవరి -ఫిబ్రవరిలో ఇతర పరీక్షలు ఉన్నందున రివిజన్‌కు సమయం సరిపోదని పేర్కొంటున్నారు. 12వ తరగతి సిలబస్ కూడా ఇంకా పూర్తి కాలేదని, విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ హ్యాష్‌టాగ్ జెఇఇమెయిన్ ఇన్ ఏప్రిల్(#Jeemainsinapril) పేరిట ట్విట్టర్ వేదికగా విద్యార్థులు కోరుతున్నారు.
గతేడాది మాదిరిగానే రెండు సెషన్లు
జెఇఇ మెయిన్‌ను గత విద్యాసంవత్సరం నిర్వహించిన విధంగానే ఈసారి కూడా రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ రెండింటిలో విద్యార్థులు ఏదో ఒక సెషన్‌కు లేదా రెండు సెషన్లకు హాజరుకావచ్చు. కొవిడ్ పరిస్థితులకు ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారంగానే 2023 జెఇఇ మెయిన్ పరీక్షలు జరగనున్నట్లు సమాచారం. జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఇంటర్మీడియేట్‌లో కనీస మార్కుల నిబంధనను మళ్లీ పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈసారి పరీక్ష నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా ఈసారి ముందుగానే పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది తొలి విడత జూన్ 20- నుంచి 29 తేదీల మధ్య జరగగా, రెండో సెషన్ పరీక్షను జులై 21- నుంచి 30 తేదీల మధ్య నిర్వహించారు.

ఈ రెండు విడతలకు 10.26 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 9,05,590 మంది పరీక్షకు హాజరయ్యారు. దేశంలోని ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటి, ఇతర విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తోన్న జెఇఇ మెయిన్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో టాప్ స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ప్రతిష్టాత్మక సంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి)ల్లో ప్రవేశాలకు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.
నోటిఫికేషన్‌పై స్పష్టత కరువు
జెఇఇ మెయిన్ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో తెలియక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. నవంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశించగా, ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్‌పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో ఎన్‌టిఎ స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. త్వరలోనే జెఇఇ మెయిన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ ఫేక్ నోట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన నేపథ్యంలో అప్‌డేట్ కోసం ఎప్పటికప్పుడు jeemain. nta. nic. in వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జనవరిలో సెట్స్ షెడ్యూల్..?
రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే జెఇఇ మెయిన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో ఎంసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎక్కువ మంది జెఇఇ మెయిన్‌కు కూడా హాజరవుతారు కాబట్టి, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఎంసెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News