కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యకు మొదటి ర్యాంకు
రాష్ట్రంలో ఏడుగురికి వంద పర్సంటైల్, మొత్తం మీద 18 మందికి ఫస్ట్ ర్యాంకు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జెఇఇ మెయిన్ (నాలుగో విడత) ఫలితాలు బుధవారం ఉదయం విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) మంగళవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకులను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు హవా కొనసాగించారు. ఇద్దరు రాష్ట్ర విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యలు మొదటి ర్యాంకు సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి దుగ్గినేని వెంకటపనీష్, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్ నాయుడు, కర్నం లోకేశ్‌కు మొదటి ర్యాంకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.in లో తెలుసుకోవచ్చు. మంగళవారం రాత్రి జెఇఇ మెయిన్ 4 ఫలితాలు ప్రకటిస్తారని పేర్కొనడంతో విద్యార్థులు వేచిచూశారు. తీరా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలు వెల్లడయ్యాయి. జెఇఇ మెయిన్ సెషన్- 4 పరీక్ష ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1,2 తేదీలలో జరిగింది. ఈ నెల 6వ తేదీన పరీక్ష పత్రం కీ పేపర్‌ను విడుదల చేశారు. ఇక జెఇఇ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 11న ప్రారంభం కావాల్సి ఉండగా, ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఎన్‌టిఎ తీరుపై విమర్శల వెల్లువ
జెఇఇ మెయిన్ ర్యాంకుల విడుదల తేదీని స్పష్టంగా చెప్పకపోవడంతో ఎన్‌టిఎ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ర్యాంకుల ప్రకటనపై అధికారికంగా ప్రకటన కూడా జారీ చేయకపోవడంతో విద్యార్థులు ట్విట్టర్,ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్‌టిఎ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదని…నాట్ టుడే ఏజెన్సీ అని వ్యాఖ్యానిస్తూ కామెంట్లు పెట్టారు. మరోవైపు జెఇఇ మెయిన్ ఫలితాలను అర్ధరాత్రి, తెల్లవారు జామున విడుదల చేస్తూ విద్యార్థులతో చెలగాటమాడుతోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే, ఫలితాల జాప్యానికి సిబిఐ విచారణ కారణం కాదని, సిబ్బంది అనారోగ్యానికి గురికావడం వల్లేనని ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషీ మీడియాకు తెలిపారు.
టాపర్లు వీరే
జెఇఇ మెయిన్ సెషన్ 4 ఫలితాల్లో 18 విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించారు. కర్నాటకకు చెందిన గౌరబ్ దాస్,బీహార్‌కు చెందిన వైభవ్ విశాల్-, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన దుగ్గినేని వెంకట పనీష్, రాజస్థాన్‌కు చెందిన -సిద్ధాంత్ ముఖర్జీ, ఢిల్లీకి చెందిన రుచిర్ బన్సల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమయ్య సింఘాల్, రాజస్థాన్‌కు చెందిన మృదుల్ అగర్వాల్, తెలంగాణకు చెందిన కొమ్మ శరణ్య, జోస్యూల వెంకట ఆదిత్య, మహారాష్ట్రకు చెందిన అథర్వ అభిజిత్ తంబత్, ఢిల్లీకి చెందిన కావ్య చోప్రా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సల్వ వీర శివ, కంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్, పంజాబ్‌కు చెందిన పుల్కిత్ గోయల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాల్ అగర్వాల్, రాజస్థాన్‌కు చెందిన గుర్రమ్రిత్ సింగ్, రాజస్థాన్‌కు చెందిన అన్షుల్ వర్మలు మొదటి ర్యాంకు సాధించారు.
తెలంగాణలో ఏడుగురికి 100 పర్సంటైల్
జెఇఇ మెయిన్ 4 ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. మధుర్ ఆదర్శ్‌రెడ్డి, పోలు లక్ష్మి సాయి లోకేష్‌రెడ్డి, కొమ్మ శరణ్య,జ్యోసుల వెంకట ఆధిత్య, కటికెల పునీత్‌కుమార్, వెలవలి వెంకట కార్తీకేయ సాయి వైధిక్‌లు 100 పర్సంటైల్ స్కోర్‌తో రాష్ట్రంలో టాపర్స్‌గా నిలిచారు.
నాలుగు సెషన్లకు 2,52,954 మంది హాజరు
జెఇఇ మెయిన్ పరీక్షల్లో ఈసారి నాలుగు సెషన్లకు 4,12,171మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 2,52,954 మంది నాలుగింటికీ హాజరయ్యారు. మొదటి సెషన్ 6,52,628 మంది దరఖాస్తు చేసుకోగా, 6,21,033 మంది హాజరయ్యారు. అలాగే రెండవ సెషన్‌కు 6,19,641 మందికి 5,56,248 హాజరుకాగా, మూడవ సెషన్‌కు 7,09,611 మందికి 5,43,553 మంది హాజరయ్యారు. నాలుగవ సెషన్‌కు అత్యధికంగా 7,67,700 మంది దరఖాస్తు చేసుకోగా, 4,81,419 మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 334 నగరాలలో 925 పరీక్షా కేంద్రాలలో నాలుగవ విడత జెఇఇ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి నాలుగు విడతల్లో జెఇఇ మెయిన్‌ను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో మొదటి సెషన్, మార్చిలో రెండవ సెషన్, జూలైలో మూడవ సెషన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నాలుగవ సెషన్ నిర్వహించారు. ఈ నాలుగింటిలో ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దానినే పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు ఖరారు చేయనున్నారు.