Monday, December 23, 2024

జెఇఇ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా..

- Advertisement -
- Advertisement -

జెఇఇ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా
దేశవ్యాప్తంగా 14 మందికి 100 పర్సంటైల్
అందులో ఏడుగురు తెలుగు విద్యార్థులే
తెలంగాణ నుంచి నలుగురికి,
ఎపి నుంచి ముగ్గురికి 100 పర్సంటైల్
మొదటి విడత ఫలితాలు విడుదల చేసిన ఎన్‌టిఎ

మనతెలంగాణ/హైదరాబాద్: జెఇఇ మెయిన్ మొదటి విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది వందకు వంద శాతం పర్సంటైల్ సాధించగా.. అందులో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ఈ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు, ఎపి నుంచి ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణకు చెందిన విద్యార్థి జాస్తి యశ్వంత్ వివిఎస్, అనికెత్ ఛటోపాధ్యాయ వై.ధీరజ్ కురుకుంద, రూపేశ్ బియాని 100 పర్సంటైల్ సాధించగా, ఎపి నుంచి కొయ్యన సుహాస్, పెనికలపాటి రవికిశోర్, పొలిశెట్టి కార్తికేయ, 100 పర్సంటైల్ సాధించారు. ఈ ఫలితాల్లో మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఫలితాలు వెల్లడించింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.inలో తెలుసుకోవచ్చు. జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగాయి. ఈ నెల 6వ తేదీన జెఇఇ మెయిన్ మొదటి విడత కీ విడుదల చేయగా, సోమవారం ఎన్‌టిఎ ఫలితాలను విడుదల చేసింది. మనదేశంతో పాటు విదేశాలలో సైతం మొత్తం 407 నగరాలలో 588 పరీక్షా కేంద్రాలలో 13 భాషలలో జెఇఇ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 8,72,432 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 7,69,589 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం జెఇఇ మెయిన్ పేపర్-1 (బిఇ, బి.టెక్) ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. పేపర్ -2 (బి.ఆర్క్, బి.ప్లానింగ్) ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఈఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు.
టాపర్లు వీరే
జెఇఇ మెయిన్ మొదటి సెషన్ ఫలితాల్లో 14 విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణకు చెందిన జాస్తి యశ్వంత్ వివిఎస్, హర్యానకు చెందిన సర్తక్ మహేశ్వరి, తెలంగాణ చెందిన అనికెత్ ఛటోపాధ్యాయ వై.ధీరజ్ కురుకుంద, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొయ్యన సుహాస్, ఝార్ఖండ్‌కు చెందిన కుశగ్ర శ్రీవాస్తవ, పంజాబ్‌కు చెందిన మ్రినాల్ గార్గ్, అస్సాంకు చెందిన స్నేహ పరేక్, రాజస్థాన్‌కు చెందిన నవ్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెనికలపాటి రవికిశోర్, పొలిశెట్టి కార్తికేయ, కర్ణాటకకు చెందిన బోయ హరేన్ సాత్విక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌమిత్ర గార్గ్, తెలంగాణకు చెందిన రూపేశ్ బియానీలు 100 పర్సంటైల్ పొందారు.
21 నుంచి రెండో విడత పరీక్షలు
జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు గత ఏడాది నాలుగు విడతల్లో జెఇఇ మెయిన్‌ను నిర్వహించగా, ఈసారి రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ రెండు సెషన్లలో ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దానినే పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు ఖరారు చేస్తారు.

JEE Main Results 2022: 14 Students get 100 percentile

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News