దేశవ్యాప్తంగా జెఇఇ మెయిన్ రెండో విడత ఫలితాలను ఈ నెల 17న విడుదల కానున్నాయి. జెఇఇ మెయిన్ సెషన్ -2 పేపర్- 1 పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్- 2 పరీక్ష బుధవారంతో ముగిసింది. మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్ ఫలితాలు ఈ నెల 17న విడుదల కానుండగా,అదే రోజు నుంచి జెఇఇ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. జెఇఇ మెయిన్ రెండు సెషన్లలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఆలిండియయా ర్యాంకులను ప్రకటిస్తుంది.
జెఇఇ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జెఇఇ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. జెఇఇ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటిలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందవచ్చు. దేశంలోని 31 ఎన్‌ఐటిల్లో గత ఏడాది సుమారు 24 వేలు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్ ఐటీల్లో దాదాపు 8,500, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు ఉన్నాయి. ఒకవేళ విద్యార్థులు ఐఐటీల్లో చేరాలనుకుంటే మే 18న జరిగే జెఇఇ అడ్వాన్స్‌డ్ రాయాల్సి ఉంటుంది.