ఇటీవల వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఎన్‌టిఎ
ఈసారి రెండు సార్లే నిర్వహించే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్ -2022 పరీక్షల షెడ్యూల్ వారం రోజుల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జెఇఇ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ విడుదల కాగా, ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) జెఇఇ మెయిన్ 2022 వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేసి, వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిసింది. జెఇఇ మెయిన్‌ను ఈసారి గతంలో మాదిరే రెండు విడతలే నిర్వహించేందుకు ఎన్‌టిఎ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై మరి కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. 2019, 2020లో జెఇఇ మెయిన్‌ను ఆన్‌లైన్ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా, 2021లో కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్టా విద్యార్థుల సౌలభ్యం కోసం నాలుగు విడతలుగా నిర్వహించారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనటం, ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నందున ఈసారి రెండుసార్లు నిర్వహిస్తే చాలని ఎన్‌టిఎ తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతేడాది నాలుగు నిర్వహించినా విద్యార్థులు పెద్దగా వినియోగించుకోలేదు. దరఖాస్తు చేసిన వారిలో 27 శాతం మంది మాత్రమే నాలుగు విడతల్లో పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి కూడా నాలుగు సార్లు నిర్వహిస్తే వచ్చే విద్యాసంవత్సర ప్రారంభమూ ఆలస్యం అవుతుందని భావిస్తున్నట్లు తెలిసింది.
అందుకే ఈసారి రెండు సార్లు నిర్వహిస్తే చాలని భావిస్తున్నారు. ఏప్రిల్‌లో మొదటి విడత,మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.
ఈసారి అభ్యర్థులు పెరిగే అవకాశం
జెఇఇ మెయిన్ అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం కనిపిస్తోంది. రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు అరకొరగా జరగ్గా అనేక రాష్ట్రాల్లో అసలు పరీక్షలే జరగలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులందరినీ పాస్ చేశారు. సిబిఎస్‌ఇ కూడా కరోనా కారణంగా చదువులు దెబ్బతినడంతో మూల్యాంకనాన్ని సరళతరం చేసింది. ఆ సంస్థల్లోనూ 99 శాతం వరకు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితంగా ఈసారి జెఇఇ మెయిన్‌కి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది.
నిబంధనలు సడలించాలని డిమాండ్లు
జెఇఇ మెయిన్ పరీక్ష రాసేందుకు కనీసం ఇంటర్‌లో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ఈసారి కూడా సడలించాలని విద్యార్థులు కోరుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ నిబంధనకు మినహాయింపు ఇవ్వగా తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆ నిబంధనను మళ్లీ అమలు చేయాలని ఎన్‌టిఎ భావిస్తోంది. విద్యార్థులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా చాలా రాష్ట్రాలలో పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ప్రమోట్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళే జెఇఇ మెయిన్‌కు హాజరుకానున్నారు.ఈ విద్యాసంవత్సరం కూడా పూర్తి స్థాయిలో తరగతులు జరగనందున చాలామంది విద్యార్థులకు ఇంటర్‌లో 75 శాతం మార్కులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, అందుకే ఈసారి కూడా ఈ నిబంధన సడలింపు కోరుతున్నారు.