జెఇఇ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పులు
20,22,25,27 తేదీల్లో మూడవ విడత పరీక్షలు
నాలుగవ విడత తేదీలు కూడా మారే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: జెఇఇ మెయిన్ మూడవ విడత పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల ప్రకారం ఈ నెల 20 నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలు ఈ నెల 20,22,25,27 తేదీల్లో జరుగనున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన జెఇఇ మెయిన్ మూడు, నాలుగు విడతల పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ప్రకటించింది. జులై 20 నుంచి 25 వరకు మూడవ విడత, జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నాలుగవ విడత పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్ విడుదల చేసింది.
అయితే, తాజాగా మూడవ విడత పరీక్ష హాల్‌టికెట్లు(అడ్మిట్ కార్డులు) విడుదల చేసిన ఎన్‌టిఎ అందులో పరీక్ష తేదీలను మార్చింది. మూడవ విడత పరీక్ష ఈ నెల 20,22,25,27 తేదీల్లో జరుగనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 7,09,519 మంది హాజరు కానున్నట్లు వివరించింది. విద్యార్థులు జెఇఇ మెయిన్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఈ నెల 27 వరకు మూడవ విడత పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అదే రోజు నుంచి జరగాల్సిన నాలుగవ విడత పరీక్ష తేదీ మారే అవకాశం ఉంది.
JEE Main Session 3 Exam 2021 Dates Revised