రేపటి నుంచి మూడవ విడత పరీక్షలు
హైదరాబాద్ : కోవిడ్ పరిస్థితులతో వాయిదా పడిన జెఇఇ మెయిన్ మూడవ విడత పరీక్షలు జరుగనున్నాయి. కొవిడ్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలు పాటించవలసి ఉన్న నేపథ్యంలో జెఇఇ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను, పరీక్షా కేంద్రాలను పెంచారు. పరీక్షా నిర్వహించే నగరాలను 232 నుంచి 334కి పెంచగా, పరీక్షా కేంద్రాలను 660 నుంచి 828కి పెంచారు.
పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలిపింది. పరీక్షా కేంద్రాలలో ఫర్నీచర్, కంప్యూటర్లు, అందరూ వినియోగించే ఇతర మెటీరియల్ సానిటైజ్ చేయాలని పేర్కొంది. జెఇఇ మెయిన్ మూడవ విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20,22,25,27 తేదీల్లో జరుగనున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన జెఇఇ మెయిన్ మూడు, నాలుగు విడతల పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ప్రకటించింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 7,09,519 మంది హాజరుకానున్నారు.
JEE Mains exam centres to be increased