మళ్లీ కీ విడుదల నేడు ఫలితాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ మెయిన్ సెషన్- 2 పరీక్షల తుది కీ మళ్లీ విడుదలైంది. తొలు త గురువారమే జెఇఇ మెయిన్ రెండో సెషన్ పేప ర్ -1కు సంబంధించిన తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) విడుదల చేసినప్పటికీ.. కొద్దిగంటల్లోనే తొలగించింది. ఇందుకు కారణమేంటో తెలపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌టిఎ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్య క్తమయ్యాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం మరోసారి తుది కీని విడుదల చేసిన ఎన్‌టిఎ, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను విరమించుకున్నట్లు పే ర్కొంది.జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం గురువారం(ఏప్రిల్ 17) నాటికి ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. నిర్ణీత గడువులోగా ఫలితాలు వెల్లడించడంలోనూ ఎన్‌టిఎ విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శుక్రవారం ఉదయం స్పందించిన ఎన్‌టిఎ..
శనివారం(ఏప్రిల్ 19)లోగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. అలాగే, ఈ మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది కీ విడుదల చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ఎదురుచూశారు. అయితే, తుది కీని సైతం చెప్పిన సమయం కన్నా గంటకు పైగా ఆలస్యంగా విడుదల చేయడంతో ఎన్‌టిఎ తీరుపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటిలు, ట్రిపుల్ ఐటిల్లో బి.ఇ/బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 11న ప్రాథమిక కీ విడుదల చేసిన ఎన్‌టిఎ.. ఈ నెల 13వరకు అభ్యంతరాలను స్వీకరించింది. రెండో విడత పరీక్షలకు దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.