Monday, January 20, 2025

వచ్చే నెలలో సెట్స్ షెడ్యూల్…?

- Advertisement -
- Advertisement -

ఈసారి ముందుగానే ప్రకటించే అవకాశం
ఖరారైన జెఇఇ, నీట్ పరీక్షల తేదీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది. జెఇఇ మెయిన్, నీట్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో త్వరలోనే సెట్స్ షెడ్యూల్ ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎక్కువ మంది జెఇఇ మెయిన్‌కు కూడా హాజరవుతారు కాబట్టి, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఎంసెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేయనుంది. సాధారణంగా ఏటా మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల కారణంగా ప్రవేశ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయి.

ఈ ఏడాదిలో జులైలో పరీక్షలు జరగగా, అంతుకు ముందు ఏడాది ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్, అక్టోబరు మొదటివారంలో నిర్వహించారు. అయితే ఈసారి కొవిడ్ పరిస్థితుల కంటే ముందుగా నిర్వహించినట్లుగానే మే లేదా జూన్ నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. 2023 జనవరి 24,25,27,28,29,30,31 తేదీలలో జెఇఇ మెయిన్ మొదటి విడత, ఏప్రిల్ 6,7,8,9,10,11,12 తేదీలలో రెండో పరీక్షలు, మే 7వ తేదీన నీట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో విధానంలో నిర్వహిస్తున్న నేపధ్యంలో అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాలను చూసుకుని సెట్స్ తేదీలు ఖరారు చేయనున్నారు.
ఇంకా కొనసాగుతున్న ప్రవేశాలు

ప్రస్తుత విద్యాసంవత్సరంలో కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. జులై నెలలో వివిధ ప్రవేశ పరీక్షలు జరుగగా, కౌన్సెలింగ్‌లో జాప్యం చోటుచేసుకుంది. దాంతో డిసెంబర్‌లో మూడు వారాలు గడుస్తున్నా ప్రవేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు ముగిసిన కొన్ని రోజులకే వచ్చే ఏడాదికి సంబంధించిన సెట్ల షెడ్యూల్ వెలువడనుంది. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి పిజి ప్రవేశపరీక్ష (సిపిగెట్) తుది విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీన ముగియగా, లాసెట్ చివరి విడత రిపోర్టింగ్ గడవు ఈ నెల 21వ తేదీన ముగియనుంది.

స్పాట్ అడ్మిషన్లు పూర్తయిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుంది. అయితే గత విద్యాసంవత్సరం జనవరి, ఫిబ్రవరి వరకు ప్రవేశాలు ప్రక్రియ కొనసాగగా, ఈసారి గతేడాది కంటే నెల, రెండు నెలల ముందుగానే ప్రవేశాలు ముగుస్తున్నాయి. గత ఏడాది కొవిడ్ పరిస్థితుల వల్ల కౌన్సెలింగ్‌లో జాప్యం జరగగా, ఈసారి సాధారణ పరిస్థితులు ఉన్నా ఆలస్యంగానే ప్రవేశాలు జరుగుతున్నాయి.

ఎంసెట్ అర్హతలపై అధ్యయనం

రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్ అర్హతలపై ఉన్నత విద్యామండలి అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీని నియమించింది. ఇంజనీరింగ్,ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) మార్గదర్శకాలు జారీ చేసింది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివిన విద్యార్థులందరికీ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు కల్పించాలని ప్రతిపాదించింది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివిన వారికి, లెదర్ టెక్నాలజీకి కెమిస్ట్రీ సబ్జెక్టు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది.

ఈ ప్రతిపాదనలపై అధ్యయనానికి ఉన్నత విద్యామండలి కమిటీని నియమించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ(ఎంపిసి) చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్ అర్హతలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. అయితే వివిధ కాంబినేషన్లలో సిబిఎస్‌ఇ సిలబస్ 10+2, ఇంటర్ ఒకేషనల్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన విద్యార్థులకు పలు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే అంశాలను కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ఎంసెట్ అర్హతలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News