హైదరాబాద్: సిఎం కెసిఆర్‌ను విమర్శించేవారు బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు అని ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాల కెసిఆర్ పై చేసిన కామెంట్లకు జీవన్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. దళితబంధు పథకం ప్రపంచంలోనే అత్యుత్తమ పథకమని ప్రశంసించారు. 17 లక్షల కుటుంబాలకు రూ. లక్ష 70 వేల కోట్లు ఇస్తామని సిఎం కెసిఆర్ చెప్పారన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏ పథకం తెచ్చినా ప్రతిపక్షాలకు అనుమానమే కలుగుతుందని, కానీ పథకాలు మాత్రం విజయవంతమవుతున్నాయన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ రాజనీతిజ్ఞత ముందు మీరెంత ? అని చురకలంటించారు.
దళితబంధు అమలుతో కాంగ్రెస్, బిజెపి కార్యాలయాలకు టూ లెట్ బోర్డు తగిలించుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డదిడ్డంగా మాట్లాడి నవ్వులపాలయ్యారని గుర్తు చేశారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తానన్నారని, సంజయ్ మాట తప్పి జోకర్‌గా పేరు తెచ్చుకున్నాడన్నారు. ఎంపి అరవింద్ మతపరంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, నిజామాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎంపి అరవింద్‌ను నిలదీసే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. అవినీతికి కాంగ్రెస్ కిటికీలు తెరిస్తే, బిజెపి దర్వాజలు తెరిచాయని మండిపడ్డారు. 70 ఏండ్ల శని ఏడేండ్లలో పోతుందా? అని, దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.