నిజామాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి మధుయాష్కీకి సబ్జెక్టు తక్కువ ,సౌండ్ ఎక్కువ పియుసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మధు యాష్కీ నిజామాబాద్ లో కెసిఆర్ ప్రభుత్వం పై చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. పొలిటికల్ టూరిస్టులా నిజామాబాద్ కు వచ్చి యాస్కీ ఏదేదో మాట్లాడుతున్నారని, పిచ్చిగా మాట్లాడితే జనాలు ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు. కెసిఆర్ కు సరితూగే నాయకులు ప్రతిపక్షాలలో లేరని, కెసిఆర్ కుటుంబాన్ని తిడితే గొప్పవాడిని అయిపోవచ్చు అనుకుంటున్నారని, మధుయాష్కీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.
సిఎం కెసిఆర్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ అంటే అవినీతి- అవినీతి అంటే కాంగ్రెస అని, యాష్కీ అమెరికా నేర చరిత్ర అందరికీ తెలుసునని, ఆరునెలలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు తెచ్చు కోవాలని చురకలంటించారు. కెసిఆర్ కాలిగోటికి ఉన్నది- కాంగ్రెస్ నేతల ముఖానికి లేదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. మధుయాష్కీ కచరా అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారి నోరు తెరిస్తే గాలికి మధుయాష్కీ కొట్టుకుపోతారని, అవినీతి గురించి యాష్కీ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఉందని మండిపడ్డారు. లాబీయింగ్ స్పెషలిస్ట్ యాష్కీ కి ప్రజా సమస్యలు తెలియవన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్ ,పురాణం సతీష్ ,వి .గంగాధర్ గౌడ్ ,ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు పాల్గొన్నారు.