రేవంత్‌రెడ్డి పరుషపదజాలం సోనియా, రాహుల్‌కు లేఖలు
కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాయడమే చివరి అస్త్రం
పద్దతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
ఆర్మూర్ ఎంఎల్‌ఎ, పియుసి ఛైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారంలోకి రాలేమని గ్రహించే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆర్మూర్ ఎంఎల్‌ఎ, పియుసి ఛైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై రేవంత్‌రెడ్డి పరుషపదజాలం వాడటంపై.. రాహుల్, సోనియాగాంధీకి లేఖలు రాసి.. ట్వీట్ చేశామని వెల్లడించారు.ఈ లేఖల తర్వాతైనా రేవంత్ పద్దతి మార్చుకోవాలని, థర్డ్ క్లాస్ మాటలు మానుకోవాలని అన్నారు. రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయడం చివరి అస్త్రమని… ఈ లేఖ తర్వాతైనా రేవంత్‌రెడ్డి పద్దతి మార్చుకోవాలని అన్నారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో గురువారం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డిది మాటలు, మూటలు, ముఠాలు చేసే వైఖరని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తే ఆధారాలు బయటపెట్టాలని అన్నారు. సొంత పార్టీలో రేవంత్‌ను ఎవరూ లెక్క చేయడం లేదనే ఆక్రోశంతో ఆయన అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ముఖ్యంమత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రగతిభవన్ నుంచే పాలన చేశారని, అప్పుడెందుకు బహుజన పేరు పెట్టలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బహుజన బోర్డులు పెట్టి తెలంగాణలో మాట్లాడాలని హితవు పలికారు.
రేవంత్‌రెడ్డిది ఐరన్ లెగ్
కాంగ్రెస్ అంటేనే జైలు పార్టీ, బెయిల్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిది ఐరన్ లెగ్ అని, ఏ పార్టీలో చేరితే అది నాశనమవుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చని, అయితే దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు వద్దని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసుంటే ఇప్పుడు తమ అవసరం ఏమొచ్చేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి.. చంద్రబాబు పెంపుడు కుక్క అని, మల్కాజిగిరిలో ఆయనకు చంద్రబాబు ఎంత డబ్బు పంపించిండో తనకు తెలుసునని వెల్లడించారు. గిరిజన ఎంఎల్‌ఎ సీతక్కతో చంద్రబాబు కాళ్లు మొక్కించాడని విమర్శించారు.
డ్రామా ఆర్టిస్టులా రేవంత్
రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్ చంద్రబాబు పెంపుడు కుక్క అని మండిపడ్డారు.వందమంది టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు తొక్కితే రేవంత్ 30 అడుగుల లోతుకు పోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ కాలిగోటికి సరిపోడని, ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. సిఎం కెసిఆర్ తెలంగాణ తెస్తేనే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారని విమర్శించారు. “మీరు తిడ్తే.. మేం తిడ్తం. ఎందుకయ్యా బురదల రాయేసి మూతి మీద చిల్లిచ్చుకుంటరు. మంచిగ మాట్లాడు. మూడు చింతలపల్లి పోయినవ్. అక్కడ ఏమని చెప్తవ్ ఇయ్యాల. 24 గంటల కరెంట్ ఇస్తున్నరు అది వద్దని చెప్తవా..? ప్రతీ ఇంటికి 2 వేల రూపాయల పింఛన్ ఇస్తున్నరు అది కూడా వద్దని చెప్తవా..? సిఎం కెసిఆర్ మేనమామ లాగా కల్యాణ లక్ష్మీ కింద డబ్బులు ఇస్తున్నరు.. అది నిజం కాదని చెప్తవా..? రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తలేమని చెప్తవా? ఇవన్నీ వాస్తవం కావంటవా..?-” అని జీవన్‌రెడ్డి నిలదీశారు.