హైదరాబాద్: మీడియా పిచ్చితో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్, చీకటి పనులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు ఉందన్నారు. మంత్రి కెటిఆర్ ఐటి రంగానికే ఐకాన్‌గా ఉన్నారని కొనియాడారు. హైదరాబాద్‌లో 11 లక్షల కెమెరాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పంజాబ్‌లో డ్రగ్స్ నేరాలు ఎక్కువ… దానిపై ఉడ్తా పంజాబ్ అని సినిమా కూడా తీశారని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు, నేరాలు ఎక్కువ అని గుర్తు చేశారు.
తెలంగాణలో పోలీస్ వ్యవస్థను సిఎం కెసిఆర్ దేశంలోనే అధునాతనంగా తీర్చిదిద్దారన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సంఘటనకు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లను బాధ్యులను చేయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపుదిద్దుకుంటుందని, కెసిఆర్ కోటలు బద్దలు కొట్టడం చంద్రబాబు వల్లే కాలేదని, రేవంత్ రెడ్డి వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్-బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా మధ్య అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. అంతమాత్రాన ఆ రాష్ట్రాల సిఎంలు తాగుబోతులా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్-బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ పథకాలు అమలవుతున్నాయా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే బిజెపికి రోహింగ్యాలు, పాకిస్తానీ వాళ్లు గుర్తుకు వస్తారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఒక్కటీ కూడా నిరూపించలేకపోయయాయని, తెలంగాణలో ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. జాకీలు పెట్టి లేపినా బిజెపి లేస్తలేదని బండి సంజయ్ బాధ అని మండిపడ్డారు.