మనతెలంగాణ/హైదరాబాద్ : పారిస్‌లో జరిగిన పారా ఒలంపిక్స్ 400 మీటర్ల పరుగు పందెంలో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024కు ఎంపిక కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలియ జేశారు. తెలంగాణ యువ క్రీడాకారులు మరింతగా రాణించాలని, యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం కానున్న స్పోర్ట్ కాంప్లెక్స్‌లు అం దుకు దోహదపడతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2024లో వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేశ్ దొమ్మరాజు (చెస్), హర్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)లకు కూడా సిఎం అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పోర్ట్ పాలసీలో భాగంగా సిఎం చేతుల మీదుగా కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేశ్‌కు రూ. 10 లక్షల నగదు బహుమతిని గతంలోనే ప్రభుత్వం అందజేసింది. అదే సమయంలో దీప్తికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించాని నిర్ణయించారు.
దీప్తి జీవాంజికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుంది: మంత్రి కొండా సురేఖ
దీప్తి జీవాంజికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. మానసిక సామర్థ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, కుంగిపోకుండా, విధిని ఎదిరించి తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి జీవాంజి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని మంత్రి సురేఖ అన్నారు. దీప్తి జీవాంజికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని మంత్రి తెలిపారు. దీప్తి మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని క్రీడారంగంలో అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పక్కా వ్యూహాంతో ముందుకు సాగుతుందని మంత్రి సురేఖ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యాచరణలో భాగంగా ఈ మధ్యే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ యూనివర్సిటీ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. సిఎం కప్ పేరుతో పోటీలు నిర్వహించి గ్రామీణుల్లో దాగిన ప్రతిభను వెలికితీస్తున్నామన్నారు. త్వరలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకొచ్చి దేశంలోనే క్రీడల రాజధానిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.