వాణిజ్య మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా నెలవారీ సవరణలు చేశాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కిలోల వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరను రూ. 41కి తగ్గించాయి. అలాగే విమాన ఇంధన(ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్) ధరను 6.15 శాతం మేరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఎటిఎఫ్ ధర రూ. 5870.54 మేరకు తగ్గి, రూ. 89441.18కి చేరింది. కాగా ఎటిఎఫ్ ధర తగ్గించాక కిలో లీటర్ ఎటిఎఫ్ ధర ముంబైలో రూ. 83575.42, చెన్నైలో రూ. 92503.80, కోల్‌కతాలో 91921గా ఉంది. స్థానిక పన్నులు, వ్యాట్ కారణంగా ఆయా రాష్ట్రాలలో ఎల్పీజి,
ఎటిఎఫ్ ధరలు వేర్వేరుగా ఉండనున్నాయి. ఇదిలావుండగా ఇళ్లకు వాడే వంట గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇంటికిచ్చే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 803గానే ఉంది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పిసిఎల్) ప్రతి నెల మొదటి రోజున వంట గ్యాస్, వైమానిక ఇంధనం(ఎటిఎఫ్) ధరలను అంతర్జాతీయ ఇంధనం, విదేశీ మారక రేట్ బెంచ్ మార్క్ సరాసరి ధర ఆధారంగా సవరిస్తుంటాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72గా, లీటర్ డీజిల్ ధర రూ. 87.62గా ఉంది.