హైదరాబాద్: ప్రముఖ దర్శకురాలు,సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తన ఇంట్లో 60 సవర్ల బంగారు నగలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేయగా ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పని చేస్తున్న ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసిన విచారించగా తానే దొంగతనం చేశానని ఒప్పుకుంది. ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో ఎంతో నమ్మకంగా పని చేస్తున్న ఈశ్వరి అసలు దొంగతనం ఎందుకు చేసిందో కూడా పోలీసులకు వెల్లడించింది. తాను ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో గొడ్డులా పని చేశానని, ఆమె చెప్పిన పనులన్నీ చేసే దానినని పోలీసులకు తెలిపింది.
ఐశ్వర్య వద్ద చాలా డబ్బున్నా తనకు మాత్రం రూ.30 వేలు జీతం ఇచ్చేదని, ఆ డబ్బు ఒక కుటుంబం బతకడానికి సరిపోతుందా? అందుకే దొంగతనాలు చేయడం మొదలుపెట్టానని ఈశ్వరి తెలిపింది. మొదట చిన్న చిన్న వస్తువులను దొంగిలించగా దొరికిపోలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా దొంగతనం చేశానని పోలీసుల విచారణలో ఈశ్వరి తెలిపింది. ఈశ్వరిని విచారించిన అనంతరం ఆమె ఇంట్లో 100 సవర్ల నగలు, 4 కిలోల వెండి, 30 గ్రాముల వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరి ఇంట్లో ఐశ్వర్య చెప్పిన దాని కంటే ఎక్కువ నగలు ఉండడంతో పోలీసులకు అనుమానాలు తలెత్తాయి.