Thursday, November 21, 2024

ఆదివాసీ పీఠాన్ని అధిష్టించేదెవరు?

- Advertisement -
- Advertisement -

సంక్షేమ పథకాల వైపు మొగ్గుతారా? సానుభూతి సరిహద్దు అంశాలకు పీటవేస్తారా? అన్న జార్ఖండ్ ఓటర్ల మనోభావాల మీద రెండు జాతీయ కూటముల గెలుపోటములు ఆధారపడ్డాయి. ఇద్దరి అమ్ముల పొదిలోనూ ఈ రెండంశాల విడివిడి అస్త్రాలున్నాయి. మొదటిది పార్టీల విశ్వసనీయతకు సంబంధించిందయితే, రెండోది ప్రజలు ఆ వాదనల్ని ఎంత వరకు విశ్వసిస్తారనేదాన్ని బట్టి ఉంటుంది. 18-50 ఏళ్ల మధ్య వయస్కులైన ప్రతి మహిళకు నెల నెలా వెయ్యి రూపాయలిచ్చే ‘మయ్యా సమ్మాన్ యోజన’ (53 లక్షల లబ్ధిదారుల)తోపాటు 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లుల మాఫీ(40 లక్షల కుటంబాలు), వ్యవసాయ రుణాల మాఫీ(1.7 లక్షల కుటుంబాలు) వంటి వివిధ సంక్షేమ పథకాల కార్యక్రమాల లబ్ధిదారులు(లాభార్థి) తమకు సానుకూలంగా ఉన్నారని, వారే ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించుకుంటారని జెఎంఎం, ‘ఇండియా’ నమ్మకంతో ఉంది.

తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు కనీస నెలసరి ఆదాయం అందించడం, ఉచిత వంటగ్యాస్, ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి, గృహ సదుపాయం.. ‘పాంచ్ ప్రాణ్’ అమల్లోకి తెస్తామని బిజెపి, ఎన్‌డిఎ ప్రచారం చేస్తోంది. ఇవికాకుండా.. బిజెపి ఆదివాసీ వ్యతిరేక పార్టీ అని, అందుకే ఎస్‌టిలకు ప్రాధాన్యత ఇవ్వకపోగా సిఎం హేమంత్ సోరెన్ని అక్రమంగా జైలుపాలు చేసిందని జెఎంఎం ప్రచారం చేస్తోంది. సరిహద్దుల నుంచి వచ్చే బంగ్లాదేశ్ చొరబాటుదారుల వల్ల స్థానిక ఆదివాసీల ప్రయోజనాలకు తీవ్రభంగం వాటిల్లుతోందని, తాము అధికారంలోకి వస్తే ఈ పరిస్థితిని ఎన్‌ఆర్‌సి అమలుతో కట్టడిచేస్తామని బిజెపి చెబుతోంది. ‘ఇండియా’ ఎన్‌డిఎ కూటములుగా ముఖాముఖి తలపడుతున్నాయి. ఎన్‌డిఎ పొత్తులు సాఫీగా జరిగితే, ఇండియా పొత్తు అరమరికలతో కుదిరింది.

పాతికేళ్లలో పదమూడు మార్లు
తెలంగాణ లాగానే, రెండు దశాబ్దాలకు పైబడ్డ ప్రత్యేక రాష్ట్ర పోరాట చరిత్ర ఉన్నా.. ఒక రాజకీయ పరిష్కారంగానే 2000లో భఋహార్ రాష్ట్ర విభజన జరిగి, జార్ఖండ్ ఏర్పడింది. పాతికేళ్లలో ఏడుగురు నాయకులు ముఖ్యమంత్రులుగా 13 మార్లు ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క రఘుబర్ దాస్ (బిజెపి) మాత్రమే పూర్తి పదవీకాలం (2014- 19) ముఖ్యమంత్రిగా ఉన్నారు. సగానికిపైగా కాలం (13 ఏళ్లు) బిజెపి అధికారంలో ఉంది. 24 ఏళ్లలో ఇది అయిదో ఎన్నిక. నవంబరు 13, 20 తేదీల్లో రెండు విడతలుగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. నవంబరు 23న ఓట్ల లెక్కింపు. ప్రతి రాష్ట్ర ఎన్నిక లాగానే, జార్ఖండ్ ఎన్నికల్ని కూడా బిజెపి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

మాజీ ముఖ్యమంత్రి చాంపయ్ సోరన్ తో పాటు పలువురు పేరున్న నాయకుల్ని పార్టీలోకి తిరిగి తెచ్చుకుంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ ముండే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. సోరెన్ లాగే, సంతాలీ అయిన మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండిని ఏడాది కిందటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసి, సదరు వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది పార్టీ. ఈ ముగ్గురే కాకుండా మరో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సేవల్ని కూడా ఉపయోగించుకుంటోంది. రెండు నెలల వ్యవధిలో రెండు మార్లు రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికల ప్రక్రియ ముగిసే లోపు మరో ఆరేడు సార్లు పర్యటించేలా ప్రచార ప్రణాళిక రచిస్తున్నారు. దానికి తోడు కేంద్ర ఇతర మంత్రులు, పలువురిని ప్రచారంలో మోహరిస్తున్నారు.

గురి ఆదివాసీల పైనే!
2019లో చేజారిన జార్ఖండ్‌ను తిరిగి పొందడానికి బిజెపి ఆదివాసీల మనసు గెలిచే సకల యత్నాలూ చేస్తోంది. జెఎంఎం బలంపై గట్టిగా దెబ్బకొట్టాలనే తలంపూ ఉంది. తాము చేసిన తప్పును గుర్తించడమే కాదు సరిదిద్దుకుంటున్న భావన జార్ఖండ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్రచా రం చేయాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఆదివాసీయేతర నాయకుడు (రఘుబర్దాస్)ని ముఖ్యమంత్రి చేసి ఆదివాసీల కోపానికి కారణమైనట్టు పార్టీ నాయకత్వం ఇదివరకే గ్రహించింది. హేమంత్ సోరెన్ పై కేంద్ర దర్యాప్తు సంస్థల కేసు, అరెస్టుతో అది మరింత ధ్రువపడింది. అందుకు మూల్యం కూడా చెల్లించింది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో 14లో 9 సీట్లు ఎన్‌డియే కూటమి గెలిచినప్పటికీ, 5 ఎస్‌టి రిజర్వుడు సీట్లలోనూ ఓడిపోయింది.

అందుకే, ఈసారి గెలిస్తే ఆదివాసీయే ముఖ్యమంత్రి అనే సంకేతాలివ్వడానికి బిజెపి నాయకత్వం యత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినా.. కొందరు ఆదివాసీ ముఖ్యనేతలను అసెంబ్లీ బరిలోకి దింపుతోంది. గీతాకోడ (చైబరా), సీతాసోరెన్ (దామ్కా), అర్జున్ ముండా (ఖరసవాన్), చాంపయ్ సోరెన్ (సరై ఖేలి), జెఎంఎం మాజీ ఎంఎల్‌ఎ లోబిన్ ఎంబ్రామ్ (రాగిమహల్ ప్రాంతం). ఆదివాసీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 10, 12 అసెంబ్లీ సీట్లయినా గెలవాలనేది వారి పట్టుదలగా కనిపిస్తోంది. పార్టీలోకి సరయురాయ్ తిరిగి రావడం కలిసొచ్చే అంశమని నాయకత్వం భావిస్తోంది. 2019 ఎన్నికల ముందు నాటి ముఖ్యమంత్రి రఘువరదాస్తో విభేదించి పార్టీ నుంచి రాయ్ వెళ్లిపోయి, స్వతంత్రంగా పోటీ చేశారు. కల్హన్ ప్రాంతంలో 14 సీట్లు ఆయన వల్ల బిజెపికి దక్కకుండాపోయాయి. ఆయనను తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడం ఓ దిద్దుబాటు చర్యే!

సానుభూతిపై గంపెడాశ
ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జార్ఖండ్‌లో ఇవాళ పాలక జెఎంఎం సహకారం లేకుండా ఏమీ చేయలేని స్థితిలోకి ఆ పార్టీ వెళ్లిపోయింది. సర్ఫరాజ్ అహ్మద్, సుబోద్కాంత్ సహాయ్, ఫుర్కాన్ అన్సారీ, రాజేందర్ సింగ్, చంద్రశేఖర్ దూబే వంటి నాయకులతో కలకలలాడిన కాంగ్రెస్ ఇప్పుడు బలం తగ్గిఉంది. పొత్తులు ఫలించడం, సంక్షేమ పథకాలు సానుకూలించడంతోపాటు సోరెన్ అరెస్టుతో రాష్ట్రంలో వ్యక్తమైన సానుభూతి పనిచేస్తే తమ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టేనని పాలక ‘జెఎంఎం’, ‘ఇండియా’ ఆశిస్తోంది. బిజెపికి బయపడి, పార్టీ మార్పిళ్ల నుంచి కాపాడుకోవడానికి సిఎం తమ ఎంఎల్‌ఎలను రెండు మార్లు ఛత్తీస్‌గఢ్‌లో క్యాంపుల్లో పెట్టాల్సి వచ్చింది.

ఈ భావోద్వేగాలను ఎన్నికల్లో లబ్ధికి ‘ఇండియా’ కూటమి వాడుకుంటోంది. బిజెపి గిరిజన, ఆదివాసీ వ్యతిరేకి అనీ ప్రచారం చేస్తోంది. సిఎం హేమంత్ సోరెన్ అరెస్టయి జైల్లో ఉన్న సమయంలో ఆయన సతీమణి కల్పనా సోరెన్ విస్తృతంగా జనంలో తిరిగి కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బొగ్గు రాయల్టీలు ఇవ్వకుండా, రాష్ట్రంపై వివక్ష చూపుతూ కేంద్రం సహకరించకపోవడమేకాక, ఆర్థికంగా జార్ఖండ్‌ను దెబ్బకొట్టే కుట్రలు చేస్తోందనీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లినట్టు కూటమి నమ్ముతోంది. మయ్యా సమ్మాన్ యోజనతో పాటు రూ. 3584 కోట్ల మేర విద్యుత్ బిల్లుల మాఫీ, రూ.400 కోట్ల మేర రైతు వ్యవసాయ రుణ మాఫీ, డిసెంబర్ నుంచి స్టయిఫెండ్‌ను రూ.2500కి పెంచుతామన్న హామీతో ప్రజల్లో సానుకూలత పెరిగిందని భావిస్తున్నారు. కాంగ్రెస్, జెఎంఎం నుంచి ఎన్నికల ముందు బిజెపిలోకి వెళ్లిన పలువురు నేతలు తిరిగి రావడాన్ని ఓ సానుకూలాంశంగా ‘ఇండియా’ వర్గాలు భావిస్తున్నాయి.

పొత్తులే గట్టెక్కించాలి
జార్ఖండ్‌లో ఏ కూటమినైనా.. అంతిమంగా పొత్తులే గట్టెక్కించాలి. ఏ ఒక్కరూ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల ప్రజామద్దతు కూడగట్టే స్థితిలో లేరు. పొత్తుల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పరచడం, విడిగా పోటీ చేసినపుడు ఓడి విపక్షంలో కూర్చోవడం.. ఈ అనుభవం ఇటు బిజెపి, అటు జెఎంఎం ఇద్దరికీ ఉంది. అందుకే సాఫీగానో, అరమరికలతోనో పొత్తుల్ని ఖరారు చేసుకొని కూటమిగానే బరిలో దిగుతున్నారు. 81 స్థానాలున్న రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ నంబర్ 41. పార్టీల మధ్య పొత్తుతో పాటు సామాజిక సమీకరణాలపైన దృష్టిపెట్టి, గెలుపే లక్ష్యం చేసుకుంటున్నారు.

2014లో విడిగా పోటీచేసి 25స్థానాలు గెలిచిన జెఎంఎం, కాంగ్రెస్‌లు 2019 ఎన్నికల్లో కలిసి పోటీచేసి 47 స్థానాలు గెలిచి, ప్రభుత్వం ఏర్పరిచారు. 2014లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు)తో పొత్తు పెట్టుకొని 42 సీట్లు నెగ్గిన బిజెపి, 2019లో పొత్తులు బెడిసి 25 సీట్లకు పరిమితమైంది. ప్రభుత్వం పోయింది. 16% జనాభాగా ఉన్న కుర్మీ మహతోల్లో పట్టున్న ఎజెఎస్‌యు కనీసం 14 అసెంబ్లీ సీట్లలో ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలోని 7 జిల్లాలు, 20 సీట్లలో ప్రభావం గల ముస్లీంలు సుమారు 15 శాతంగా ఉన్నారు. ఒబిసి జనాభా 46%. ఆదివాసీయేతర 53 సీట్లలో ఎన్‌డిఎ మిత్రపక్షాలైన జనతాదళ్ (యునైటెడ్), లోక్‌జనశక్తి (రామ్‌విలాస్) పార్టీలతో పొత్తు వల్ల కూటమికి లబ్ధి చేకూరనుంది.

అందుకే, బిజెపి(68), ఎజెఎస్‌యు(10), జెడి(యు)(2), ఎల్‌జెపి(1) కలిసి పోటీ చేయాలని సయోధ్యతో ఉన్నాయి. ‘ఇండియా’ కూటమిలోనూ సీట్ల పంపకాలు జరిగినా.. మూడు స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులే పరస్పరం పోటీలో ఉండే పరిస్థితి తలెత్తింది. జెఎంఎం (43), కాంగ్రెస్ (30), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి)(5), సిపిఐ-ఎంఎల్ (3) పార్టీలు కలిసి మొత్తం 81 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నారు. కానీ, కాంగ్రెస్‌కు కేటాయించిన రెండు సీట్లలో ఆర్‌జెడి, సిపిఐ-ఎంఎల్‌కు కేటాయించిన ఒక చోట కాంగ్రెస్.. పొత్తులకు విరుద్ధంగా పోటీలో దిగుతున్నాయి. ఇన్ని సంక్లిష్టతల మధ్య జార్ఖండ్ ఆదివాసీ పీఠం అధిష్టించే, గెలుపెవరిదో తేలేది నవంబరు 23 ననే!

దిలీప్‌రెడ్డి, (రచయిత పొలిటికల్ అనలిస్ట్,‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News