Wednesday, January 22, 2025

సోనియాతో హేమంత్ సోరెన్ భేటీ

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకు శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. భార్య కల్పనతో కలసి హేమంత్ సోరెన్ ఢిల్లీలో 10 జన్‌పథ్ నివాసంలో సోనియాతో సమావేశం అయ్యారు. ఇది మర్యాదపూర్వక సమావేశమేనన్న సోరెన్ లోక్‌సభ ఎన్నికల తరువాత, తాను జైలులో నుంచి విడుదల అయిన పిమ్మట సోనియాను కలుసుకోలేదు కనుక ఆమెతో భేటీ కోసం వచ్చినట్లు తెలియజేశారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల గురించి సోనియాతో చర్చించారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు, ‘ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చలు కొనసాగుతాయి& ఎన్నికల గురించి చర్చించలేదు’ అని సోరెన్ సమాధానం ఇచ్చారు.

‘భారతీయులు అత్యంత సున్నిత మనస్కులు, సహనశీలురు. వారు వీలైనంత వరకు సహనం వహిస్తారు. సహనం కోల్పోతే వోటింగ్ ద్వారా తమ మాట వినిపిస్తారు’ అని ఆయన చెప్పారు, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు కూడా త్వరలో బెయిల్ మంజూరు అవుతుందని సోరెన్ ఆశాభావం వెలిబుచ్చారు. భూ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసు సందర్భంగా ఇడి జనవరి 31న అరెస్టు చేయడానికి ముందు జెఎంఎం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జైలులో సుమారు ఐదు మాసాలు గడిపిన అనంతరం సోరెన్ బెయిల్ సంపాదించి ఈ నెల 4న తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.

సునీతా కేజ్రీవాల్‌తో కూడా సోరెన్ సమావేశం
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌తో కూడా సమావేశం అయ్యారు. ఢిల్లీ సిఎం అధికార నివాసంలో జరిగిన ఆ సమావేశానికి ఆప్ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ కూడా హాజరయ్యారు. ‘నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇండియా సంఘటితంగా ఉంది’ అనే వ్యాఖ్యతో ఆప్ ఆ సమావేశం వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News