రాంచీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్‌కు తాజాగా సమన్లు జారీ చేసిన తరువాత హేమంత్ సోరెన్ శనివారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి ప్రయాణమయ్యారు. మనీల్యాండరింగ్ కేసులో ప్రశ్నించడానికి ఈనెల 29,లేదా 31న అందుబాటులో ఉంటారా అని ఈడీ అడిగింది. “ఈ పర్యటన ముందుగా అనుకున్నది కాదు. ఈడీ సమన్లు వచ్చిన తరువాతనే అకస్మాత్తుగా ఈ పర్యటన జరిగింది.
ఈనెల 29న చైబాసాలో , 30న పాలములో, 31న గిరిడిహ్‌లో వరుసగా సిఎం కార్యక్రమాలు ఉన్నాయి ” అని అధికారి ఒకరు పేర్కొన్నారు. సోరెన్ ఢిల్లీకి చట్టపరమైన సంప్రదింపుల కోసం వెళ్లారని కొన్ని వర్గాలు తెల్పగా, ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం వీటిని ధృవీకరించలేదు. ఈనెల 20న ఈడీ ముఖ్యమంత్రి సోరేన్ వాంగ్మూలాన్ని ఆయన అధికారిక నివాసంలో నమోదు చేసింది. అయితే ఆరోజు ప్రశ్నించడం పూర్తి కానందున తాజాగా సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. అక్రమంగా భూ యాజమాన్య మార్పిడికి సంబంధించి భారీ రాకెట్ ఉందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. ఈ కేసులో ఇంతవరకు 14 మందిని అరెస్ట్ చేసింది.