రాంచీ: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో భార్య, పిల్లలు సహా 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాంచీ చీఫ్‌మెడికల్ ఆఫీసర్ వినోద్‌కుమార్ తెలిపారు. హేమంత్ సోరెన్‌కు నెగిటివ్‌గా తేలిందని వెల్లడించారు. సీఎం నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 24 మంది పరీక్షా ఫలితాలు రాగా, అందులో 15 మందికి పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. సిఎం సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళాముర్దులకు పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. వీరంతా స్వల్ప కొవిడ్ లక్షణాలతో ఇంట్లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. సిఎం నివాసం లోని వారికే కాకుండా ఆరోగ్యశాఖ మంత్రి బన్నాగుప్తాకు కూడా పాజిటివ్‌గా తేలడంతో జమ్‌షెడ్‌పూర్‌లోని ఆయన నివాసంలో ఐసొలేషన్‌లో ఉన్నారని వినోద్ తెలిపారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో పరీక్షించుకోగా పాజిటివ్‌గా తేలిందని మంత్రి గుప్తా ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన సన్నిహితంగా ఉన్న వారందరూ పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే మంత్రికి గత ఏడాది ఆగస్ట్‌లో కొవిడ్ సోకగా మరోమారు మహమ్మారి బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.74 లక్షల కొవిడ్ కేసులు, 5164 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే ఒమిక్రాన్ కేసు ఇప్పటివరకు ఇక్కడ నమోదు కాకపోవడం గమనార్హం.
Jharkhand CM’s Wife and Son test positive Corona