ఖుంతీ (ఝార్ఖండ్) : ఐఐటి విద్యార్థిని లైంగికంగా వేధించారన్న నేరారోపణపై ఝార్ఖండ్ లోని ఖుంతీ జిల్లా ఐఎఎస్ అధికారిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడు సయ్యద్ రియాజ్ అహ్మద్ ఖుంతీ జిల్లా సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన తరువాత సోమవారం రాత్రి అరెస్టు చేయడమైందని పోలీస్ సూపరింటెండెంట్ అమన్‌కుమార్ చెప్పారు. బాధితురాలితోపాటు ఐఐటికి చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వేరే ప్రాంతం నుంచి ఖుంతీకి శిక్షణ కోసం వచ్చారు. శనివారం డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ నివాసంలో విందుకు వీరు హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతోపాటు అతిధులందరికీ లిక్కర్ సరఫరా చేశారు. విద్యార్థుల్లో మహిళా విద్యార్థిని ఒక్కరే ఉండడం ఐఎఎస్ ఆఫీసర్ గమనించి లైంగికంగా వేధించాడని పోలీస్‌లకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణలో అహ్మద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తేలిందని ఎస్‌పి చెప్పారు. బాధితురాలైన విద్యార్థిని వైద్యపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించామని, ఈ సంఘటనపై దర్యాప్తు సాగుతోందని ఎస్‌పి తెలిపారు.