Friday, January 3, 2025

రాంచీలో కుటిల రాజకీయం

- Advertisement -
- Advertisement -

Indian Independence Day Diamond Celebrations

 జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని బిజెపి రద్దు చేయించింది. బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ గత ఫిబ్రవరిలో చేసిన ఫిర్యాదు మీదనే గవర్నర్ రమేష్ బైస్ ఈ కేసును కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) దృష్టికి తీసుకు వెళ్లారు. రాజ్యాంగం 192 అధికరణ ప్రకారం శాసన సభ్యుల అనర్హత కేసులలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలి.

దానిపై గవర్నర్ కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరుతారు. అది ఏమి చెబుతుందో ఆ ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకొంటారు. హేమంత్ సోరెన్ సొంతానికి ఒక కంకర గని లీజును కేటాయించుకొన్నారనే కారణం చూపి ఆయన శాసన సభ్యత్వ రద్దును బిజెపి కోరగా చివరికి ఆ విధంగా జరిగిపోయింది. ఆర్ధిక ప్రయోజనాలు కలిగించే లాభదాయక పదవులను చేపట్టే వారు తమ పార్లమెంటు, శాసనసభ సభ్యత్వాలు కోల్పోతారని భారత రాజ్యాంగం 102 (1) (ఎ), 191(1)(ఎ) అధికరణలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు ప్రభుత్వానికి సరకుల సరఫరాకు, దాని పనుల నిర్వహణకు దానితో ఎటువంటి కాంట్రాక్టులు కుదుర్చుకోరాదని, అలా చేసినవారు తమ సభ్యత్వాలను కోల్పోతారని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 9వ సెక్షన్ చెబుతున్నది. చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వేరే ప్రభుత్వ పదవుల్లో ఉండడమో, లాభసాటి ప్రభుత్వ కాంట్రాక్టులు స్వీకరించడమో జరిగితే వారు ఎంపిలుగా, ఎంఎల్‌ఎలుగా విధులను నిష్పాక్షికంగా నిర్వర్తించలేరనే దృష్టితో లాభసాటి పదవుల నిర్వహణ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు.

రాచరిక ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గాని, దాని నుంచి పెన్షన్ పొందుతున్నవారు గాని ప్రతినిధుల సభ సభ్యులుగా ఉండడానికి అనర్హులని బ్రిటిష్ ప్రభుత్వం 1701లో చేసిన సెటిల్మెంట్ చట్టం దీని మూలంలో వుంది. ఎంపిలు, ఎంఎల్‌ఎలుగా ఉంటూ ప్రభుత్వ కాంట్రాక్టులు సంపాదించి కోటానుకోట్లు గడిస్తున్నవారికి లోటులేని రోజుల్లో, స్వయంగా బిజెపియే కేంద్రంలోని అధికారాన్ని ఉపయోగించి కాంట్రాక్టుల ఆశ జూపి ఫిరాయింపులు జరిపిస్తున్నదనే విమర్శ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హేమంత్ సోరెన్‌పై వచ్చిన ఈ ఆరోపణ ఆయన ముఖ్యమంత్రి పదవికి గండంగా మారడం విచిత్రమే. ఎందుకంటే తనపై ఫిర్యాదు దాఖలైన తర్వాత సోరెన్ ఆ గని లీజును తనకు తానుగా వదులుకొన్నారు. 2018 జనవరిలో ఎన్నికల సంఘం లాభదాయక పదవుల చట్టం కింద ఢిల్లీలోని 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంఎల్‌ఎల సభ్యత్వాల రద్దుకు సిఫారసు చేసింది. విచిత్రంగా 2021 మార్చిలో మణిపూర్‌కు చెందిన 12 మంది బిజెపి ఎంఎల్‌ఎలకు అనుకూలమైన నిర్ణయాన్ని ఎన్నికల సంఘం తీసుకొన్నది.

ఎంఎల్‌ఎలు పార్లమెంటరీ కార్యదర్శులుగా పని చేయడం లాభదాయక పదవులు నిర్వహించడం కిందికి రాదని 2012లో, 2018లో మణిపూర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలు అమల్లో ఉన్నప్పుడు వారు ఆ పదవులు నిర్వహించారనే కారణం చూపించి ఎన్నికల సంఘం వారిని నిర్దోషులుగా నిర్ణయించింది. అయితే ఆ రెండు చట్టాలను మణిపూర్ హైకోర్టు 2020 సెప్టెంబర్‌లో రద్దు చేసింది. హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు అయినప్పటికీ తక్షణమే ఆయన వైదొలగవలసిన అవసరముండదు. ఆరు నెలల్లోగా జరిగే ఉపఎన్నికలో తిరిగి గెలవవచ్చు. మొత్తం 81 మంది సభ్యులున్న జార్ఖండ్ శాసనసభలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జెడి ఉమ్మడి ప్రభుత్వానికి మంచి మెజారిటీ వున్నది. జెఎంఎం బలం 30, కాంగ్రెస్ 18. అందుచేత హేమంత్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు.

అది 2024 వరకు నిక్షేపంగా కొనసాగుతుంది. ఎన్నికల సంఘం సీలు వేసిన కవర్లో పంపిన నిర్ణయం ముందుగానే బయటపడడాన్ని హేమంత్ సోరెన్ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ దీన్‌దయాళ్ మార్గ్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసి దీనిని జరిపించారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఎన్నడూ జరగని సిగ్గుమాలిన చర్య. మీరు రాజ్యాంగ సంస్థలను కొనగలరు గాని, ప్రజాభిమానాన్ని చూరగొనలేరు అని బిజెపి నాయకత్వాన్ని ఉద్దేశించి హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్య గమనించదగినది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళగలమని జెఎంఎం నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్, జెఎంఎం సభ్యులను కొనేసి ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గానికి బిజెపి పాల్పడితే జార్ఖండ్‌లో మరో ప్రజాస్వామిక వధ జరిగిపోతుంది. అటువంటిది సంభవించకుండా చూసుకోవలసిన బాధ్యత అక్కడి ప్రజలపై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News