Friday, November 22, 2024

రాయపూర్ రిసార్ట్‌కు జార్ఖండ్ యుపిఎ ఎంఎల్‌ఎలు

- Advertisement -
- Advertisement -

Jharkhand UPA MLAs to Raipur Resort

ప్రత్యేక విమానంలో రాంచీనుంచి వచ్చిన 31 మందిశాసన సభ్యులు

రాయపూర్: జార్ఖండ్‌లో హేమంత్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అక్రమంగా మైనింగ్ లీజ్ సంపాదించారంటూ బిజెపి నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదును గవర్నర్ ఎన్నికల కమిషన్ పరిశీలనకు పంపించడంతో సోరేన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇసి సిఫార్సు చేసింది. అయితే ఇసి సిఫార్సు చేసినా గవర్నర్ రమేశ్ బైస్ ఆయనపై చర్య తీసుకోలేదు. కానీ ఏ క్షణంలోనైనా చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి తమ ఎంఎల్‌ఎలను తమ వైపునకు తిప్పుకోవచ్చని భయపడుతున్న సోరేన్ పభుత్వాన్ని కాపాడుకునేందుకు కూటమిలోని ఎంఎల్‌ఎలను తన వెంటే తిప్పుకొంటున్నారు. ఇన్నాళ్లూ జార్ఖండ్ రాజధాని రాంచీలోనే ఎంఎల్‌ఎలను తన వద్దే ఉంచుకున్న సోరేన్ తాజాగా అధికార యుపిఎ కూటమిలోని ఎంఎల్‌ఎలను చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌కు తరలించారు. 81 మంది సభ్యులుండే జార్ఖండ్ అసెంబ్లీలో అధికార జెఎంఎం, కాంగ్రెస్,ఆర్‌జెడి కూటమికి 49 మంది సభ్యుల మద్దతు ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన బిజెపికి 26 మంది ఎంఎల్‌ఎలున్నారు.

మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు 32 మంది ఎంఎల్‌ఎలను తీసుకుని రాంచీనుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం 5.30 గంటలకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అనంతరం ఎంఎల్‌ఎలనందరినీ మూడు బస్సుల్లో అక్కడికి పది కిలో మీటర్ల దూరంలోని నయాపూర్‌లో ఉన్న మేఫెయిర్ రిసార్ట్‌కు తరలించినట్లు స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. అయితే జార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్ మాత్రం వీరి వెంట రాలేదని ఆయన చెప్పారు. చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతలు రాంగోపాల్ అగర్వాల్, గిరీశ్ దేవాంగన్‌లు కూడా ఎంఎల్‌ఎల వెంట రిసార్ట్‌కు వెళ్లినట్లు ఆ నేత చెప్పారు. బస్సులకు ఎస్కార్ట్‌గాపైలట్ వాహనాలు వెళ్లాయి. కాగా రిసార్ట్ చుట్టుపక్కల గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియా వాళ్లు ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. కాగా ఎంఎల్‌ఎలు రావడానికి ముందు పలువురు విఐపిలు, పోలీసుల వాహనాలు రిసార్ట్‌లోకి వెళ్లడాన్ని న్యూస్‌చానళ్లు ప్రసారం చేశాయి.

బిజెపి ప్రలోభ పెడుతుందేమోనన్న భయంతో గత ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు చెందిన ఎంఎల్‌ఎలను రాయపూర్‌కు తరలించడం ఇది మూడో సారి. ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తమ ఎంఎల్‌ఎలు క్రాస్ ఓటింగ్ చేసేలా బిజెపి ప్రలోభ పెడుతుందేమోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ తమ ఎంఎల్‌ఎలను రాయపూర్‌కు తరలించింది. అలాగే గత ఏడాది అసోం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి భాగస్వామి అయిన బోడోల్యాండ్ పీపుల్స్ పార్టీ అభ్యర్థులను రాయపూర్‌కు తీసుకొచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News