రాంచీ: జాతీయ రహదారిపై ఏర్పడిన బురదగుంటలో కూర్చుని ఝార్ఖండ్ కాంగ్రెస్ మహిళా ఎంఎల్‌ఎ ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని గోడ్డాలో జరిగింది. హైవేను తక్షణమే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ దీపికా పాండే సింగ్ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బురదనీటిని ఆమెపై చల్లుకుని నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై భారీ గుంతలను వెంటనే పూడ్చి మరమ్మతు చర్యలు చేపట్టేవరకూ అక్కడ నుంచి కదలనని ఆమె భీష్మించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న పోరులో తాను కలుగజేసుకోవాలని అనుకోవడం లేదని ఆమె తెలిపారు.
ఎన్‌హెచ్ అధ్వాన్నస్థితికి అధికారులు బాధ్యత వహించాలని మహాగామా ఎంఎల్‌ఎ దీపిక డిమాండ్ చేశారు. హైవే మరమ్మతుల కోసం కేంద్రం ఎటువంటి నిధులు మంజూరు చేయడం లేదని ఆమె విమర్శించారు. సిఎం హేమంత్‌సోరెన్ ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా గొడ్డా ఎంపి దూబె మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సిఎంకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారని, రాష్ట్ర రహదారుల శాఖ ఆ హైవే బాధ్యతలు నిర్వహిస్తుందన్నారు. కేంద్రం ఆరు నెలల క్రితమే రూ.75కోట్లు కేటాయించిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే ఎంపి వ్యాఖ్యలు అవాస్తవాలని ఎంఎల్‌ఎ దీపిక ఖండించారు.