అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు, ఆయన కుటుంబానికి 2023లో విదేశీ నేతల నుంచి వేలాది డాలర్లు విలువ చేసే కానుకలు అందాయి. జిల్ బైడెన్ ఒక్కరే అత్యంత ఖరీదైన కానుక అందుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 20 వేల డాలర్లు విలువ చేసే వజ్రాన్ని బహూకరించారు. మోడీ నుంచి అందిన 7.5 క్యారట్ల వజ్రం 2023లో ప్రథమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అందుకున్న అత్యంత ఖరీదైన కానుక అదే. అయితే, ఆమె అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి నుంచి 14063 డాలర్లు విలువ చేసే పైట పిన్ను లేదా భూషణం, ఈజిప్ట్ అధ్యక్షుడు, ప్రథమ మహిళ నుంచి 4510 డాలర్లు విలువ చేసే కంకణం, పైటపిన్ను, ఒక ఫోటోగ్రాఫ్ ఆల్బమ్ కూడా అందుకున్నట్లు యుఎస్ విదేశాంగ శాఖ గురువారం ప్రచురించిన వార్షిక నివేదిక వెల్లడించింది. విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం,
20 వేల డాలర్ల వజ్రాన్ని వైట్ హౌస్ తూర్పు విభాగంలో అధికార వినియోగానికి అట్టిపెట్టుకోగా, అధ్యక్షుడు, ప్రథమ మహిళ అందుకున్న ఇతర కానుకలను ప్రాచీన భాండాగారానికి పంపారు. వజ్రం వినియోగం గురించి మాట్లాడాలన్న అభ్యర్థనకు ప్రథమ మహిళ కార్యాలయం వెంటనే స్పందించలేదు. యుఎస్ అధ్యక్షుడు స్వయంగా ఖరీదైన అనేక కానుకలు అందుకున్నారు. వాటిలో దక్షిణ కొరియా అధ్యక్షుడుగా ఇటీవలే అభిశంసనకు గురైన సుక్ యోల్ యూన్ నుంచి 7100 డాలర్లు విలువ చేసే ఒక ప్రత్యేక ఫోటో ఆల్బమ్, మంగోలియా ప్రధాని నుంచి 3495 డాలర్లు విలువ చేసే మంగోలియన్ యోధుల ప్రతిమ, బ్రూనై సుల్తాన్ నుంచి 3300 డాలర్ల వెండి పాత్ర, ఇజ్రాయెల్ అధ్యక్షుని నుంచి 3160 డాలర్ల స్టెర్లింగ్ వెండి ట్రే కూడా ఉన్నాయి. ఫెడరల్ చట్టం ప్రకారం, 480 డాలర్లు కన్నా ఎక్కువ విలువ చేసే కానుకలను విదేశీ అధినేతలు, సమకాలీన నేతల నుంచి అందుకున్నప్పుడు వాటి వివరాలను ఎగ్జిక్యూటివ్ విభాగం అధికారులు వెల్లడించవలసి ఉంటుంది.