తైవాన్‌ను చైనాలో విలీనం చేసితీరుతాం
బలప్రయోగానికి వెనుకాడేది లేదు
డ్రాగన్ సైనిక శక్తికి తిరుగుండదు
సిపిసి మహాసభలలో జి జిన్‌పింగ్
అమెరికా కూటమి యత్నాలకు హెచ్చరికలు
బీజింగ్: తైవాన్ పునరేకీకరణకు బలప్రయోగానికి వెనుకాడేది లేదని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ స్పష్టం చేశారు. చైనా మాతృదేశంతో తైవాన్‌ను విలీనం చేసే విషయంలో రాజీపడేది లేదన్నారు. రికార్డు స్థాయిలో చైనాకు మూడవసారి, జీవితాంతపు అధ్యక్షుడుగా మరింత బలోపేతంగా పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్న జిన్‌పింగ్ ఇక్కడ ఆదివారం చైనా అధికార పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) 20వ మహాసభలో ప్రసంగించారు. అయిదేళ్ల కోసారి వారం రోజుల పాటు జరిగే సిపిసి మహాసభల తొలిరోజున ఆయన మాట్లాడారు. ఈ సదస్సు సందర్భంగానే పార్టీ ఆయనకు మూడోసారి పగ్గాలు కట్టబెట్టనుంది. సైనిక శక్తిని వాడకుండా ఉండేదిలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాతో తైవాన్ కలిపివేత జరుగుతుందని జిన్‌పింగ్ తెలిపారు. దేశ సైనిక శక్తిని అత్యంత అధునాతనం చేస్తామని, ప్రపంచ స్థాయిలో ప్రామాణికం చేసుకుని దేశ సర్వసత్తాకత, భద్రత, అభివృద్ధిపరమైన ప్రయోజనాల కోణంలోతిరుగులేకుండా వ్యవహరిస్తామని చైనా బలోపేత నేత స్పష్టం చేశారు. తైవాన్ ఇప్పటికీ తనకు తాను స్వతంత్ర దేశంగా భావిస్తోంది. అయితే ఈ స్వయంపాలిత దీవి దేశం తమ దేశం నుంచి విడిపోయిన ప్రాంతంగా చైనా నమ్ముతోంది. ఈ క్రమంలో చైనా తీవ్రస్థాయిలోనే తైవాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు సైనిక విన్యాసాలను ముమ్మరం చేయడం, తైవాన్‌కు మద్దతుగా అమెరికా ముందుకు రావడం వంటి పరిణామాల దశలో చైనా అధ్యక్షులు తైవాన్‌పై రాజీలేదని ప్రకటించడం కీలకం అయింది. చైనా పునరేకీకరణ తమ ముందు ఉన్న లక్షం అని, తైవాన్ ఇతర ప్రాంతాలను చైనా ప్రధాన భూమిలోకి తీసుకువచ్చేందుకు తాము ప్రతిన వహిస్తున్నామని తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీ మరింత ధృఢంగా వ్యవహరించి తైవాన్ అంశాన్ని తగు విధంగా పరిష్కరించాల్సి ఉంటుందని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన జిన్‌పింగ్ పిలుపు నిచ్చారు.
ఏకపక్ష ఆధిపత్య ధోరణిని సహించేది లేదు
ఏ దేశం పట్ల అయినా ఏ కూటమి లేదా ఏ సంస్థ అయినా ఆధిపత్య ధోరణికి దిగితే సహించేది లేదని, ప్రపంచ స్థాయి ఏక లేదా గుత్తాధిపత్యాన్ని చైనా సహించేది లేదని జిన్‌పింగ్ తెలిపారు. అన్ని రకాల ఏకపక్ష వాదాలను చైనా నిరసిస్తుంది. ఖండిస్తుంది. ఈ చేష్టలను అడ్డుకుంటుందని హెచ్చరించారు. క్వాడ్ వంటి కూటములను దృష్టిలో పెట్టుకుని చైనా సిపిసి 20వ జాతీయ మహాసభలలో దేశాధ్యక్షులు తమ ప్రసంగంలో ప్రస్తావించారు. కొన్ని దేశాలు ఏకం కావడం, ఇతర దేశాలను బెదిరించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వంటి అంశాలను నివేదికలో తెలిపారు. గడిచిన ఐదేళ్లలో తమ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల వివరాలతో నివేదికను జిన్‌పింగ్ పార్టీ ముందుంచారు. ఐరాస పరిధిలో ఇమిడి ఉండే అంతర్జాతీయ వ్యవస్థ పరిరక్షణకు చైనా కట్టుబడి ఉంటుందని తెలిపారు. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలతో ఏర్పడ్డ ఔకస్‌లపై తరచూ చైనా విరుచుకుపడుతోంది.
తిరుగులేని నేతగా మావో తరువాత ఇతనే
ముచ్చటగా మూడోసారి పటిష్టంగా జీవితాంతం
జిన్‌పింగ్ నాయకత్వంపై ఇటీవలి కాలంలో తలెత్తిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఆయననే తిరిగి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యేందుకు, రికార్డు స్థాయిలో వరుసగా మూడో సారి దేశాధ్యక్షులు అయ్యేందుకు రంగం సిద్ధం అయింది. సాధారణంగా పార్టీ జాతీయ మహాసభలలో పార్టీ అగ్రస్థాయి నేతల పదవులకు పోటీ జరుగుతుంది, ఇంతకు ముందటి పనితీరును బట్టి వారిని తిరిగి ఎన్నుకోవడం లేదా కొత్తవారిని పార్టీ నేతలుగా తీసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు ఆరంభమైన ఐదు రోజుల మహాసభలలో జి తప్ప మిగిలిన వారందరిని మార్చివేస్తారని, వీరి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారని వెల్లడైంది. ఈ విధంగా జిన్‌పింగ్‌కు మరింత అనుకూల రీతిలోనే పార్టీ ప్రక్షాళన జరుగుతుందని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. జిన్‌పింగ్‌కు కొంచెం పోటీగా చలామణిలోకి వచ్చిన రెండో స్థాయి నేత ప్రధాని లి కిక్వియాంగ్ సహా అందరిని పదవులను తప్పిస్తారు. ఇక 69 ఏండ్ల జిన్‌పింగ్ ఇప్పటికీ సర్వం సహాధికారాలతో పార్టీ సైన్యం, ప్రభుత్వానికి తిరుగులేని నేతగా సాగుతూ వచ్చి ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తి అవుతోంది. మరో ఐదేళ్లు ఆయన తన పాలనను ఎదురువాదనలు లేకుండా మల్చుకుంటున్నారు. పార్టీ వ్యవస్థాపక నేత మావో జెడాంగ్‌కు సమానంగా జిన్‌పింగ్‌ను పార్టీ ఇప్పటికే ఆయువుపట్టు నేత (కోర్ లీడర్)గా ప్రకటించింది. ఈ క్రమంలో తిరిగి జిన్‌పింగ్‌ను దేశాధినేతగా కొనసాగించే అంశాన్ని లాంఛనంగా పార్టీ మహాసభలలో ధృవీకరిస్తారని వెల్లడైంది.
Jinping Warns will merge Taiwan in China