నేడు టెలికాం, మొబైల్ తయారీ కంపెనీలతో ప్రభుత్వం సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో 5జి మొబైల్ సేవ ప్రారంభించినప్పటికీ వినియోగదారుల వద్ద ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్‌లు ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం లేదు. దీని తర్వాత సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యాపిల్, సామ్‌సంగ్, ఇతర మొబైల్ ఫోన్ తయారీదారులతో సమావేశం కానుంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం బుధవారం(అక్టోబర్ 12) స్మార్ట్‌ఫోన్ తయారీదారులు, టెలికాం ఆపరేటర్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్టోబరు 1న ప్రభుత్వం 5జి మొబైల్ సేవలను ప్రారంభించగా, చాలా మొబైల్ కంపెనీల హ్యాండ్‌సెట్ మోడల్స్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ 5జి నెట్‌వర్క్‌కు మద్దతు ఇవ్వడం లేదనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కంపెనీలతో సమావేశానికి పిలుపునిచ్చింది. 1న ప్రధానమంత్రి 5జి మొబైల్ సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత రిలయన్స్ జియో నాలుగు నగరాల్లో, ఎయిర్‌టెల్ 8 నగరాల్లో 5జి మొబైల్ సేవలను ప్రారంభించాయి. రానున్న రోజుల్లో ఇతర నగరాలకు కూడా 5జి సేవలను విస్తరించనున్నట్టు రెండు కంపెనీలు తెలిపాయి.