టెలికమ్ సంస్థ రిలయన్స్ జియో తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. దేశంలోని ప్రీపెయిడ్ చందాదారుల కోసం చౌక అయిన వాయిస్ ఓన్లీ ప్లాన్‌ను సంస్థ పునరుద్ధరించింది. రూ. 189కే అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్, పరిమిత డేటా ప్యాక్ సేవలతో ప్లాన్‌ను తీసుకువచ్చింది. ట్రాయ్ ఆదేశాలకు కట్టుబడి రిలయన్స్ జియో ఇటీవల వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించింది. కొంత కాలం తరువాత ఈ సంస్థ తక్కువ, సరసమైన ధరలకే సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు చౌక ధరలకే వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ కోసం స్వతంత్ర ప్రత్యేక టారిఫ్ వోచర్లు అందించేందుకు సిద్ధమైంది.
రూ. 189 ప్లాన్ వివరాలు
దేశంలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో రూ. 189 ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం, 28 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను జియో అందిస్తోంది. అదే విధంగా 64 కెబిపిఎస్ వేగంతో 2జిబి డేటాను సంస్థ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా జియో టివి, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తోంది. అయితే, ఇందులో కాంప్లిమెంటరీ జియోసినిమా ప్రీమియం ఏక్సెస్‌కు అవకాశం లేదు. ఈ ప్లాన్‌ను ఎక్కువగా డేటా అవసరం లేని చందాదారులు వినియోగించుకునే అవకాశం ఉంది.