న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆగస్ట్ 29న ఎజిఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో రిలయన్స్ జియో 5జి సేవల కోసం రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు. అయితే ఈ పెట్టుబడుల కోసం టారిఫ్‌ను పెంచాల్సి ఉంటుందని స్టాక్‌మార్కెట్‌కు చెందిన విదేశీ పరిశోధనా సంస్థ జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. 2021-22లో రిలయన్స్ జియో సగటు ఆదాయం పర్ యూజర్ (ఆర్పు) రూ. 150గా ఉందని, అది ఇప్పుడు రూ.176కి పెరిగిందని నివేదికలో పేర్కొంది. 2025 నాటికి టారిఫ్‌ను పెంచిన తర్వాత ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయం రూ. 200 కంటే ఎక్కువగా పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేస్తోంది. అయితే ప్రీపెయిడ్, పోస్ట్ టారిఫ్ పెంపు తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుందని వెల్లడించింది. 5జి స్పెక్ట్రమ్ వేలంలో జియో మొత్తం రూ.88,078 కోట్లకు బిడ్ వేయగా, భారతీ ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల స్పెక్ట్రమ్‌కు బిడ్ వేశాయి. జియో దీపావళి నాటికి దేశంలోని అనేక పెద్ద నగరాల్లో 5జి మొబైల్ సేవలను ప్రారంభించనుంది.