Sunday, January 19, 2025

జకోవిచ్‌కు ఎదురుందా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో రారాజుగా వెలుగొందుతున్న సెర్బియా యోధుడు, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కొత్త సీజన్ (2024)ను భారీ ఆశలతో ప్రారంభించనున్నాడు. కిందటి ఏడాది రికార్డు స్థాయిలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించి నయా చరిత్ర సృష్టించిన జకోవిచ్ ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. 2023లో ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ ఫైనల్లో మాత్రం స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ చేతిలో కంగుతిన్నాడు. ఈసారి మాత్రం నాలుగు టైటిల్స్‌ను తన ఖాతాలోనే వేసుకోవాలనే లక్షంతో ఉన్నాడు.

ఒకవైపు వయసు పెరుగుతున్నా జకోవిచ్ మాత్రం అసాధారణ ఫిట్‌నెస్‌తో యువ ఆటగాళ్ల జోరుకు కళ్లెం వేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. చిరకాల ప్రత్యర్థుల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ గాయాలతో కిందటి ఏడాది ఆటకు దూరంగా ఉన్నాడు. ఈసారి నాదల్ బరిలోకి దిగుతున్నా అతను జకోవిచ్ ఏ స్థాయిలో పోటీ ఇస్తాడో చెప్పడం కష్టమే. జకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఎదురులేని శక్తిగా మారాడు. రెండో స్థానంలో ఉన్న నాదల్ ఖాతాలో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జకోవిచ్ సాధించిన రికార్డును నాదల్ అధిగమించడం కష్టంగానే చెప్పాలి. వరుస గాయాలతో సతమతమవుతున్న నాదల్ కిందటి సీజన్‌లో కొన్ని టోర్నీల్లో మాత్రమే ఆడాడు. ఈ ఏడాది మాత్రం సీజన్ మొత్తం ఆడాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. పోరాట పటిమకు మరో పేరుగా చెప్పుకునే నాదల్‌ను తక్కువ అంచనా వేయలేం. ఒకవేళ ఈ సీజన్‌లో నాదల్ పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగితే జకోవిచ్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం కూడా నాదల్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడిన స్పెయిన్ పోరాట యోధుడు నాల్ వరుస గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పెను ప్రకంపనలు సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News