తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, కొత్త గవర్నర్‌కు పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కిషన్ రెడ్డితో సహా మంత్రులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సిఎంగా పని చేశారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వారు. కాగా రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 1990లో బిజెపిలో చేరారు. ఆయన అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆయనకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవిని కట్టబెట్టింది.
గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం పలికిన సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. బుధవారం ఉదయం 9.15 గంటలకు త్రిపుర రాజధాని అగర్తలా నుంచి జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గం.లకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ దళాల గౌరవ వందనాన్ని నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వీకరించారు.