ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవ్హాద్‌ను ఎన్‌సిపి ఆదివారం నియమించింది. ఇంతవరకూ ఎన్‌సిపి తరఫున ఈ స్థానంలో అజిత్ పవార్ ఉన్నారు. ఆదివారం జరిగిన పరిణామాలలో ఆయన తిరుగుబాటు చేసి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీనితో స్పందించి వెంటనే థానే జిల్లాలోని ముంబ్రా కల్వా నియోజకవర్గ ఎమ్మెల్యే జితేంద్రను పార్టీ చీఫ్ విప్‌గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమిస్తున్నట్లు ఎన్‌సిపి రాష్ట్ర విభాగం అధ్యక్షులు జయంత్ పాటిల్ తెలిపారు. దీని మేరకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఇకపై తన విప్‌కు కట్టుబడి ఉండాలని, పార్టీలో ఇప్పుడు తలెత్తిన తిరుగుబాటు , తరువాతి అనర్హత వేటు కోణంలో కొత్త నేత జితేంద్ర తెలిపారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐలు కొందరు ఎన్‌సిపి నేతలపై దర్యాప్తు జరుపుతున్న దశలో కేసులకు భయపడి వీరు గోడదూకారని జితేంద్ర వ్యాఖ్యానించారు. ఇంతకు మించి ఈ నేతలు రాష్ట్ర ప్రభుత్వంలో చేరడానికి వేరే కారణాలు లేవని తెలిపారు. వారు ఇటువంటి చర్యకు పాల్పడకుండా , కిమ్మనకుండా ఉంటే పొయ్యేదన్నారు. గత పాతికేళ్లలో తమకు మంత్రి పదవులు, పార్టీ కీలక స్థానాల్లో కూర్చోబెట్టిన పార్టీని , పార్టీ నేతలను కాదంటూ ఈ విధంగా వ్యవహరించడం అసమంజసం అన్నారు. వారు ఏకంగా తమ పార్టీ నేత 83 ఏండ్ల వయస్సులో చరమాంకంలో ఉన్న పవార్ వంటి నేతను వదిలిపెట్టి వెళ్లడం ధర్మం అన్పించుకోదన్నారు.