వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బుధవారం నాడు కమలం కండువా కప్పుకొని బిజెపిలో చేరారు. 49 ఏళ్ల జితిన్ యుపిలో గణనీయమైన ప్రజాబలం ఉన్న నాయకుడు కాదు. అయినా ఒకప్పటి యుపిసిసి అధ్యక్షుడు జితేంద్ర ప్రసాద కుమారుడు కావడం, యుపిఎ పాలనలో కేంద్ర మంత్రిగా పని చేయడం, రాష్ట్ర జనాభాలో 12 శాతంగా గల బ్రాహ్మణ వర్గానికి చెంది ఉండడం ఆయన బిజెపిలో చేరడానికి ప్రాధాన్యాన్ని కలిగిస్తున్నాయి. దాదాపు 20 కోట్ల జనాభాతో 403 అసెంబ్లీ నియోజక వర్గాలున్న యుపి ఎన్నికలు విశేషమైనవి. ప్రస్తుత శాసన సభలో 306 స్థానాల అత్యధిక బలం గల పాలక బిజెపికి ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. యుపిలో తిరిగి అధికారంలోకి రావడం, రాలేకపోడం అనేది 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఇప్పటి నుంచే యుపిలో పరిస్థితిపై దృష్టి సారించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో ఆరా తీయడానికి పరిశీలకులను పంపిస్తున్నది. ఆదిత్యనాథ్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళితే పార్టీ పుట్టి మునిగిపోవచ్చుననే భయంతో ఆయనను తొలగించి కొత్త సిఎంను నియమించాలని బిజెపి యోచిస్తున్నట్టు ఊహాగానాలు ఇటీవల ముమ్మరించాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వయానికి ఆదిత్యనాథ్‌కు విభేదాలు తలెత్తాయనే అభిప్రాయమూ చోటు చేసుకున్నది. మోడీకి సన్నిహితుడైన గుజరాత్ కేడర్ మాజీ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మను గత జనవరిలో యుపి శాసన మండలి సభ్యుడుగా చేశారు. ఆయనకు ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కీలక శాఖను అప్పగిస్తారనుకున్న అంచనాలు నిజం కాలేదు గాని మోడీ సొంత వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో కొవిడ్ సంక్షోభ నివారణ బాధ్యతలను ఆయనకప్పగించారు. కొవిడ్ రెండు దశల్లోనూ దానితో పోరాటంలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం కృషిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. గంగా నదిలో గుట్టలుగా శవాలు కొట్టుకు రావడం వంటి దృశ్యాలు విమర్శలకు దారి తీశాయి.
అయితే ఇతర చాలా రాష్ట్రాలతో పోల్చినప్పుడు కొవిడ్‌తో పోరాటంలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెనుకబడిందేమీ లేదనే అభిప్రాయమూ ఉన్నది. ముమ్మరంగా పరీక్షలు జరిపించడం ద్వారా కొవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో యుపి ప్రభుత్వం సఫలమవుతున్నట్టు చెబుతున్నారు. అయితే మొత్తంగా అక్కడ యోగి పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరని తెలుస్తున్నది. రాష్ట్రంలోని మూడంచెల పంచాయతీ వ్యవస్థకు ఇటీవల జరిగిన భారీ ఎన్నికల్లో ఈ విషయం రుజువైనట్టు భావిస్తున్నారు. పార్టీ రహితంగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 3050 జిల్లా పంచాయతీ వార్డులకూ అభ్యర్థులను నిలబెట్టినట్టు బిజెపి చెప్పుకున్నది. అందులో 900 మంది గెలిచినట్టు తానే ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అభ్యర్థులు 1000 స్థానాల్లో నెగ్గినట్టు వెల్లడయింది. బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) 300 స్థానాలను, కాంగ్రెస్ 70 సీట్లను గెలుచుకోగా, అత్యధిక స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మొత్తమ్మీద బిజెపి గాలి సన్నగిల్లిన విషయం ఈ ఫలితాల్లో ప్రస్పుటమైంది.
సామాజిక, శాంతి భద్రతల రంగాల్లో ఆదిత్యనాథ్ పాలన అమిత నిరంకుశంగా, ఏకపక్షంగా సాగుతున్నదనే అభిప్రాయాన్ని కాదనలేము. భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడంలో యోగి ప్రభుత్వానికి సాటి మరొకటి లేదనే విమర్శ తెలిసిందే. దళితులు, ముస్లింలు ఇతర మరికొన్ని అణగారిన వర్గాలు ఆయన పాలన పట్ల సంతృప్తిగా లేరనేది వాస్తవం. దళిత మహిళలపై అత్యాచార, హత్యాచార దారుణోదంతాలు తరచుగా వార్తలకెక్కుతున్నాయి. రాష్ట్రంలోని మహోబా ప్రాంతంలో గ్రామ ప్రధాన్‌గా ఎన్నికైన దళిత మహిళ పంచాయతీ భవన్‌లో జిల్లా అధికారులతో వీడియో సదస్సులో ఉండగా పై కులానికి చెందిన వారు ఆమెను కుర్చీలోంచి బయటకు లాగి అవమానపరిచిన దారుణం నాలుగు రోజుల క్రితమే సంభవించింది. దళితులు, ముస్లింలు రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం ఉంటారు. బిసిలు మరి 40 శాతం. వీరిలో అత్యధికులు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హిందుత్వ నిర్ణయాలను, అగ్రవర్ణ అనుకూల చర్యలను హర్షించడం లేదు.
అయితే ఆయన ప్రభుత్వం తీసుకున్న గో రక్షక , లవ్ జిహాద్ వ్యతిరేక నిర్ణయాలను అగ్రవర్ణ హిందుత్వ ఓటర్లు హర్షిస్తారు. ఇవన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. దీనికి తోడు దేశంలో కొవిడ్‌ను బలంగా ఎదుర్కోడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఘోర వైఫల్యాలు, రైతు ఉద్యమాన్ని నీరుగార్పించడానికి పన్నుతున్న కుట్రలు, అధిక ధరలు, నిరుద్యోగం వంటివి ఆ పార్టీ విజయావకాశాలపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశమున్నది. దేశ ప్రజలు బిజెపి కఠిన హిందుత్వ పాలనను ఇంకా కోరుకుంటున్నారో లేదో యుపి ఎన్నికల ఫలితాలు తెలియజేయగలవు.