Tuesday, April 8, 2025

జ్ఞానపీఠంపై నిలిచిన వినోద్ కుమార్ శుక్లా

- Advertisement -
- Advertisement -

భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలిలో అద్భుతమైన చేసిన కృషికి గానూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చిన్న కథా రచయిత, కవి, వ్యాసకర్త, సమకాలీన రచయితలలో ఒకరైన ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ గ్రహీతగా ఎంపికయ్యా రు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న తొలి రచయితగా వినోద్ కుమార్ శుక్లా నిలిచారు. ఈ అవార్డుకు ఎంపికైన 12వ హిందీ రచయితగా శుక్లా గుర్తింపు పొందారు. జ్ఞానపీఠ్ అవార్డు ఎంపిక సందర్భంగా వినోద్ కుమార్ శుక్లా మాట్లాడుతూ.. ‘ఇది ఒక పెద్ద అవార్డు అని, ఈ అవార్డు తన బాధ్యతను కూడా గుర్తిస్తుందని’, తనకు ఇలాంటి గుర్తింపు లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటూ శుక్లా ఆనందం వ్యక్తం చేశారు.

‘నేను జీవితంలో చాలా చూశాను, చాలా విన్నాను, చాలా అనుభవించాను.. కానీ నేను కొంచెం మాత్రమే రాయగలిగాను. నేను ఎంత రాయాలో ఆలోచించినప్పుడు చాలా మిగిలి ఉన్నట్లు అనిపిస్తుంది. నేను సజీవంగా ఉన్నంత వరకు, నా మిగిలిన రచనలను పూర్తి చేయాలనుకుంటున్నాను. కానీ నా పనిని పూర్తి చేయలేకపోవచ్చు! దీని కారణంగా నేను చాలా సందిగ్ధంలో ఉన్నాను. నా రచన ద్వారా నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను.

కానీ నా జీవితం వేగంగా ముగింపునకు చేరుకుంటోంది, మరి అంత త్వరగా ఎలా రాయాలో నాకు తెలియదు కాబట్టి నేను కొంచెం విచారంగా ఉన్నాను’ అని 88ఏళ్ల ఆయన అన్నారు. ఈ గుర్తింపును బాధ్యతగా అభివర్ణించారు. శుక్లా 1 జనవరి 1937న ఛత్తీస్‌గఢలోని రాజ్‌నందన్‌గావ్‌లో జన్మించారు. జబల్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయం నుండి వ్యవసాయంలో యం.యస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత రాయ్‌పూర్‌లోని వ్యవసాయ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. ఆయన కవి ముక్తిబోధ్ చేత చాలా ప్రేరణ పొందారు. ఆయన అప్పట్లో రాజ్‌నంద్‌గావ్‌లోని దిగ్విజయ్ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పనిచేశారు. ఆయన బోధనను వృత్తిగా ఎంచుకుని సాహిత్య సృష్టిపై దృష్టి సారించారు.

ఆయన మొదటి కవితా సంకలనం, ‘లగ్భాగ్ జై హింద్’, 1971లో ప్రచురించబడింది. వాహ్ ఆద్మీ చలా గయా నయా గరం కోట్ పెహంకర్ విచార్ కీ తరాహ్ ఆయన రెండవ కవితా సంకలనం. నౌకర్ కీ కమీజ్ (ది సర్వెంట్స్ షర్ట్) ఆయన రాసిన మొదటి నవల. ‘ఖిలేగా తో దేఖేంగే’, ‘దీవార్ మే ఏక్ ఖిడ్కి’ ఉత్తమ హిందీ నవలలుగా చాలా ప్రజాదరణ పొందాయి. చిన్న కథల సంకల నం పేడ్ పర్ కమ్రా (రూమ్ ఆన్ ది ట్రీ), సబ్ కుచ్ హోనా బచా రహేగా, మహావిద్యాలయ లాంటివి ఇతర కవితా సంకలనాలు. ఆకాశ్ ధరీ కో ఖటక్తా హై కవితా సే లంబీ కవితలు అతని కవితలు. శుక్లా పిల్లల కోసం పుస్తకాలు కూడా రాశారు. దాదాపు యాభై ఏళ్లుగా సాహిత్య రచనలో నిమగ్నమై ఉన్నారు. ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రయోగాత్మక రచనల కొత్త స్రవంతికి మార్గదర్శకుడు. తన కవితలు, కథలు, రచనలు సామాజిక అంశాలను, మానవ సంబంధాలను లోతుగా పరిశీలిస్తాయి. సాధారణ ప్రజల జీవితాలను, వారి కష్టాలను, ఆశలను ప్రతిబింబిస్తాయి.

వినోద్ కుమార్ శుక్లా రచనలు సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తూ, మానవ సంబంధాల లోతులను స్పృశిస్తాయి. తన రచనలతో సమకాలీన హిందీ కవిత్వాన్ని సుసంపన్నం చేసిన ఆయన యావత్ భారతీయ కవితా రంగంలో గుర్తింపు పొందారు. ‘మ్యాజికల్- రియలిజం’ చుట్టూ సాగే ఒక కళా ప్రక్రియగా అనుభూతి చెందగల ఒక ఉత్తేజకరమైన హావభావాలా ఆయన సాహిత్య శైలి, సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసి పాఠకులను ఆకట్టుకుం ది. జానపద కథలను, ఆధునిక మానవుని సంక్లిష్టమైన అస్తిత్వ ఆకాంక్షల వ్యక్తీకరణను జోడించి ఒక కొత్త కథా నిర్మాణాన్ని ఆవిష్కరించారు. దైనందిన జీవితంలోని కథన గొప్పతనాన్ని అద్భుతమైన నైపుణ్యంతో తన నవలల ద్వారా తెలియజేశారు.

మధ్యతరగతి జీవితంలోని సూక్ష్మాంశాలే విలక్షణమైన పాత్రలుగా రూపుదిద్దారు. ఇవి భారతీయ కథాసృష్టికి ఎనలేని తోడ్పాటును అందించాయి. ఒక కొత్తరకం విమర్శనాత్మక దృక్పథాన్ని ఆవిష్కరించడానికి ప్రేరణ కలిగించిన తన తరం రచయిత ఆయన ఒక్కరే. నేడు ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన రచయిత. తన విలక్షణమైన భాషా స్వరూపం, భావోద్వేగ లోతు, అద్భుతమైన సృజనాత్మకతతో భారతీయ ప్రపంచ సాహిత్యాన్ని ప్రత్యేకంగా సుసంపన్నం చేశారు. అందుకే ఆయ న రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటా యి. వినోద్ కుమార్ శుక్లా కవితలు విస్తృతంగా అనువదించబడ్డాయి. 2015లో ఢిల్లీకి చెందిన రచయిత అఖిల్ కత్యాల్ శుక్ల ’హతాషా సే ఏక్ వ్యక్తి బైత్ గయా’ని ఆంగ్లంలోకి అనువదించారు.

అవార్డులు: 1999లో ఉత్తమ హిందీ రచనగా సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న దీవార్ మే ఏక్ ఖిడ్కీ ఉన్నాయి. ఈ నవలను నాటక దర్శకుడు మోహన్ మహర్షి రంగస్థల నాటకంగా రూపొందించారు. ఆయన అనేక ప్రతిష్టాత్మక ప్రశంసలను, ఎన్నో అవార్డులు అందుకున్నారు. వీటిలో గజానన్ మాధవ్ ముక్తిబోధ్ ఫెలోషిప్, రజా అవార్డు ఉన్నాయి. ఆయన రచనలలో నౌకర్ కీ కమీజ్. దీనిని మణి కౌల్ అదే పేరుతో సినిమాగా రూపొందించారు.

జ్ఞానపీఠ పురస్కారం: భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైం ది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వా గ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, రూ.11 లక్షల నగదు ఈ పురస్కారంలో భాగం. 1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా ‘ఓడక్కుళల్ (వెదురు వేణువు) ‘కవితా సంకలనంకు గానూ మలయాళ రచయిత జి.శంకర కురుప్కు 1965లో వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. అయితే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్లు ఆ భాషా సాహిత్యాన్ని పురస్కారానికి పరిశీలించరు. అవార్డు భారత రాజ్యాంగంలోని 8వ షె డ్యూల్‌లో చేర్చబడిన భారతీయ భాషలలో, ఆం గ్లంలో వ్రాసే భారతీయ రచయితలకు మాత్రమే ఇవ్వబడుతుంది. మరణానంతరం ఎలాంటి ప్రధా నం ఉండదు.

జనక మోహనరావు దుంగ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News