Monday, December 23, 2024

జెఎన్‌యు గుణ‘పాఠం’

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్‌సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి ప్రభావం లేని పార్టీలతో సైతం పొత్తు కోసం ఆరాటపడుతూ ఉండటం గమనిస్తే ఈ ఎన్నికల్లో ప్రతి సీటు కూడా ఎంతో విలువైనది అన్నట్లుగా వ్యవహరించడం కనిపిస్తున్నది. పలు జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలలో ముఖ్యంగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోవడం పట్ల, అత్యధిక ప్రజల ఆదాయాలు పడిపోతూ ఉండటం పట్ల, ధనిక పేదల మధ్య అగాధం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోతూ ఉండటం పట్ల ప్రజలలో తీవ్ర నిరాశా నిస్పృహలు నెలకొన్నట్లు స్పష్టం అవుతుంది.

అయినప్పటికీ తిరిగి మోడీ మరోసారి ప్రధాని కాగలరని ప్రతిపక్ష నేతలు సైతం పరోక్షంగా అంగీకరిస్తుండటం కనిపిస్తున్నది. ‘ఇండియా నుండి భారత్’ యాత్రను గత రెండు నెలలుగా జరుపుతూ దేశ వ్యాప్తంగా ప్రజల నాడి తెలుసుకోవడం కోసం పర్యటిస్తున్న ప్రముఖ జర్నలిస్టు, రచయిత, సి ఓటర్ కార్యనిర్వాహక డైరెక్టర్ సుతాను గురు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ విషయమై ఆసక్తికర అంశాలు తెలిపారు. ప్రతిపక్షాల బలహీనతలే అందుకు ప్రధాన కారణంగా స్పష్టం చేశారు. ప్రజలు మోడీ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు వారి విశ్వాసం పొందే ప్రయత్నాలు చేయలేకపోతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రతికూల అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే పట్టుకొని వేలాడుతూ ప్రజలలో ఓ సానుకూల భరోసా కల్పించే ప్రయత్నం చేయలేకపోతున్నాయని, మరోవంక ప్రధాని మోడీ భవిష్యత్తు పట్ల అందమైన కలలను ప్రజల ముందుంచగలుగుతున్నారని పేర్కొన్నారు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తామనో, 2047 నాటికి ‘వికసిత భారత్’గా మలుస్తామనో సాధారణ ప్రజల దైనందిన జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపలేని అంశాలను అందంగా ముందుంచుతున్నారని గుర్తు చేశారు.దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రభుత్వాలు విజయవంతంగా అమలు పరుస్తున్న పలు సంక్షేమ పథకాలను మొదటిసారిగా ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు పరచడం కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి ప్రభంజనానికి కారణమని తెలిపారు. అయితే దక్షిణాదిన అటువంటి పథకాలు కొత్తవి కాకపోవడం తో ఇక్కడ బిజెపి తగు ప్రభావం చూపలేకపోతున్నట్లు చెప్పారు. కాంగ్రెసేతర పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ మినహాయించి మరెక్కడా బిజెపి ఆధిపత్యం పొందలేకపోతున్నది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో బిజెపి ఎదిగే ప్రయత్నాలు ఫలించడం లేదు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బిజెపి బలమైన పక్షంగా ఎదిగినా కాంగ్రెస్, సిపిఎం లను మట్టికరిపించి ఆ స్థాయికి చేరుకోగలిగింది.

కానీ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ను మాత్రం దెబ్బకొట్టలేకపోతున్నది. అందుకనే తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పై కన్నా ప్రాంతీయంగా బలంగా ఉన్న బిఆర్‌ఎస్, జెడిఎస్‌లను ఉనికి కోల్పోయే విధంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బిజెపి ఎంతగా బలం పుంజుకొంటున్నా సీట్లు గెల్చుకొనే పరిస్థితి కనిపించడం లేదు. తమిళనాడులో బిజెపి రెండంకెల శాతం ఓట్లు పొందనున్నట్లు వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ అదంతా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అణ్ణామలైను ఓ గొప్ప నాయకుడిగా మీడియా చేస్తున్న సృష్టి ఫలితమే అని సుతాను గురు స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో బిజెపి పాలనపట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగితే సగానికి పైగా సీట్లలో బలమైన ప్రత్యర్థిగా ఉన్న తాము పెద్ద ప్రయత్నం చేయకుండానే అధికారంలోకి వస్తామనే మితిమీరిన ధీమాతో తప్పులమీద తప్పులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది.

ముఖ్యంగా పార్టీలో ఎటువంటి అధికార హోదా లేకుండా రాహుల్ గాంధీ ‘వీటో పవర్’ అనుభవించడాన్ని ప్రజలు హర్షించలేకపోతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిపినా తమ కీలు బొమ్మగా వ్యవహరించే నేతను ఎన్నుకోవడం ద్వారా సంస్థాగతంగా పార్టీ క్రియాశీలం కాకుండా అడ్డుకొన్నట్లయింది. అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబాన్ని ఎదిరించి పోటీపడిన శశిథరూర్ 1700కు పైగా ఓట్లు తెచ్చుకోవడం గమనిస్తే స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనే నాయకుడి అవసరాన్ని పార్టీ శ్రేణులు గుర్తిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఆ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని, శశిథరూర్‌ను అధ్యక్షునిగా ఎన్నుకొని ఉంటే రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండేవి. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో ప్రధాని మోడీని దీటుగా ఎదుర్కోగల మేధాసంపద ఉండటమే కాకుండా, అంతర్జాతీయ వ్యవహారాలలో మంచి అనుభవం గల నేత కూడా కావడం గమనార్హం. ‘ఇండియా’ కూటమి ఏర్పాటు సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని సూత్రప్రాయంగా అక్టోబర్ 1న నిర్ణయించారు.

ఆ మేరకు ఓ నెల రోజులలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాట్లు పూర్తి కావాలని నిర్ణయించారు. కానీ ఆ దిశలో ప్రయాణం చేయకుండా కీలకమైన కాంగ్రెస్ అడ్డంకులు కల్పిస్తూ రావడంతో ఈ కూటమి చెల్లాచెదురైంది. మరోవంక, బిజెపి ఎత్తుగడలకు తల్లడిల్లిపోతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో ‘లెఫ్ట్ కంచుకోట’గా పేరొందిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి వారం రోజుల క్రితం జరిగిన ఎన్నికల నుండి ఓ గుణపాఠం గ్రహించాలి. ఐదేళ్ల విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా ఈ ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికల్లో ఎబివిపి విజయం సాధిస్తుందనే భరోసాతోనే ఎన్నికలు జరిపారు. ఎబివిపి విజయం సాధిస్తే లెఫ్ట్ చివరి స్థావరం కూడా బద్దలైపోయిందని, ఇక దేశంలో తమకు తిరుగులేదని సంకేతం ఇవ్వాలని బిజెపి రంగం సిద్ధం చేసుకుంది. ఓట్ల లెక్కింపులో మొదట్లో ఎబివిపి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో టివి ఛానల్స్‌లో విజయోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

అయితే, అర్ధరాత్రి అయ్యేసరికి లెఫ్ట్ కూటమి ఘన విజయం సాధించడంతో ఇవన్నీ మూగబోయాయి. ఈ మధ్య కాలంలో అక్కడ ఎబివిపి బలం పుంజుకోవడం, యూనివర్సిటీ వ్యవహారాలపై పట్టు సాధించడం జరిగింది. లెఫ్ట్ వెనుకంజ వేస్తూ వస్తోంది. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన ఓ విద్యార్థిని గతంలో ఎప్పుడో బహిష్కరణకు గురైందని చూపుతూ పోలింగ్‌కు కొద్దీ గంటలకు ముందు, తెల్లవారుజామున 2 గంటలకు ఆమె నామినేషన్ చెల్లదని యూనివర్సిటీ ప్రకటించింది. దాని తో ఆమెకు కోర్టుకు వెళ్లి స్టే పొందే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక ఎబివిపి అభ్యర్థి దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి నెలకొంది. అయితే లెఫ్ట్ కూట మి అప్పటికప్పుడు మేల్కొని, పోటీలో ఉన్న ఓ అంబేడ్కర్ వాదంకు చెందిన అభ్యర్థికి మూకుమ్మడిగా మద్దతు తెలపడం ద్వారా ఎబివిపి అభ్యర్థిని ఓడించారు.

ఈ విధంగా ప్రతిపక్షాలు ఉమ్మడిగా వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రయత్నం నేడు దేశంలో కనిపించకపోవడం బిజెపికి ఎదురు లేకుండా చేస్తున్నది. పైగా, ఇదే సమయంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విధానం ఉన్నత విద్యావంతులైన యువతలో ప్రతికూల ప్రభావం చూపిం ది. ఎబివిపి అభ్యర్థుల ఓటమిలో ఈ అంశం కూడా కీలకంగా మారినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఈనాడు బిజెపిని వేధిస్తున్న మరో సమస్య ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేతలకు మించి, ప్రత్యర్థి శిబిరంలో నేతలకు ఎక్కువగా ప్రజాదరణ లభిస్తుండటం. ఉదాహరణకు బీహార్‌లో నితీశ్ కుమార్ బిజెపితో చేతులు కలిపి ప్రజల దృష్టిలో పలుచబడ్డారు. నేడు ఆ రాష్ట్రంలో తేజస్వి యాదవ్‌కు ప్రజాదరణ నానాటికీ ఎక్కువగా పెరుగుతుంది. అదే విధంగా మహారాష్ట్రలో బిజెపితో చేతులు కలిపి పదవులు పొందిన నేతలకన్నా ఉద్ధవ్ థాకరే పట్ల సానుభూతి ఎక్కువగా వ్యక్తం అవుతుంది.

తమిళనాడులో తాము బిజెపితో చేతులు కలిపిన కారణంగానే రాజకీయంగా చతికిలపడే పరిస్థితి ఏర్పడిందనే అన్నాడిఎంకె నేతలు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా జరిగారు. పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్‌ల ముందు బలహీనమవుతున్న అకాలీదళ్ ‘రైతు వ్యతిరేక పార్టీ’గా ముద్రపడిన బిజెపితో చేతులు కలిపేందుకు వెనకాడుతుంది. కర్నాటకలో తమ రాజకీయ ఉనికి కోసం బిజెపితో చేతులు కలిపిన జెడిఎస్ కారణంగా బిజెపి ఏమేరకు లాభపడగలదో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును బెదిరించి నోటా కన్నా తక్కువ ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ అత్యధికంగా ఎంపి, ఎంఎల్‌ఎ సీట్లు పొందినప్పటికీ అటువంటి బెదిరింపులకు ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ లొంగకపోవడంతో అక్కడ పొత్తు సాధ్యం కాలేదు. ఎన్నికల బాండ్ల వ్యవహారం తర్వాత బిజెపి సైతం అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా ఓ అవినీతి పార్టీగా స్పష్టమైంది. అయితే, అవినీతిని ఎన్నికలలో ఓ అంశంగా ప్రజలు గుర్తించడం ఎప్పుడో మరచిపోవడంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేదు. ఎన్ని బలహీనతలున్నప్పటికీ ప్రతిపక్షాల వైఫల్యాలు బిజెపికి కొండంత అండగా నిలుస్తున్నాయి.

చలసాని నరేంద్ర , 98495 69050

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News