ఢిల్లీ జెఎన్‌యు విసి శాంతిశ్రీ వెల్లడి
న్యూఢిల్లీ : దేశ విభజనపై పూర్తి స్థాయి అధ్యయనానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) వైస్ ఛాన్సరల్ శాంతిశ్రీ దూలిపూడి పండిట్ ఆదివారం తెలిపారు. దేశ విభజన కారణాలు, ఇది ఏ విధంగా జరిగిందీ? అనే అంశంపై ఇప్పటికీ కొన్ని చారిత్రక లొసుగులు ఉన్నాయి. వీటిని పరిశోధించి భావితరాలకు దేశవిభజనపై సమగ్ర స్వరూపాన్ని అందించాల్సి ఉందని విసి స్పష్టం చేశారు. ఇటువంటి అధ్యయన కేంద్రం ఏర్పాటు ఆవశ్యకత గురించి యుజిసికి, కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు జెఎన్‌యూ ప్రతిపాదనలు పంపిస్తుందని వివరించారు. స్వాతంత్య్ర భారతదశలో దేశ విభజన పలు రకాల కడగండ్లను మిగిల్చింది. దీనికి సంబంధించి పలు అనధికారిక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై సమగ్ర అధ్యయనం అవసరం , తాము ఏర్పాటు చేయదల్చుకున్న కేంద్రం ఈ దిశలో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలోని బాధితులైన సామాన్యుల నుంచి వివరాలను రాబట్టుకుంటుంది. ఈ విధంగా సమగ్ర సమాచారం వెలుగులోకి వస్తుందని విసి ఆశాభావం వ్యక్తం చేశారు.