Wednesday, January 22, 2025

ప్రిపరేషన్

- Advertisement -
- Advertisement -

503 గ్రూప్-1 ఉద్యోగాలకు 17,291 పోలీస్ కొలువులకు, టెట్‌కు విడుదలైన నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్న మరిన్ని ఉద్యోగాలప్రకటనలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాక కొత్తగా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు, వాటి శాఖలు సబ్జెక్టుల వారీగా నిపుణులను ఆశ్రయిస్తున్న ఆశావహులు కుర్చీలు, పుస్తకాలు సహా వెళ్లి లైబ్రరీల వద్ద అధ్యయనం 95శాతం స్థానిక రిజర్వేషన్ కారణంగా గ్రూప్-1 ఉద్యోగాలకు తీవ్ర పోటీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూసిన అభ్యర్థులు, ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ప్రిపరేషన్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు, 17,291 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అలాగే టెట్‌కు నోటిఫికేషన్ వెలువడి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మరికొన్ని రోజుల్లో పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో అధిక శాతం కోచింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.అభ్యర్థుల నుంచి డిమాండ్ మేరకు కోచింగ్ సెంటర్లు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఫంక్షన్ హాళ్లు, భవనాలు అద్దెకు తీసుకుంటున్నారు. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బ్యాచ్‌ల వారీగా కోచింగ్‌లు ఇస్తున్నారు.

జిల్లాల నుంచి నగరానికి…

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి చాలామంది నగరానికి చేరుకుని కోచింగ్ సెంటర్లు లేదా హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది. సబ్జెక్టులవారీగా నిపుణులను ఎంపిక చేసుకుని వారు కోచింగ్ ఇచ్చే కేంద్రాలలో కోచింగ్‌లు తీసుకుంటున్నా రు. చాలామంది అభ్యర్థులు ఒకే సెంటర్‌లో కోచింగ్ తీసుకోకుండా, సబ్జెక్టులవారీగా నిపుణులు అందుబాటు లో ఉన్న రెండు మూడు కోచింగ్ కేంద్రాలలో శిక్షణ తీసుకుంటున్నారు. సివిల్స్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం గ్రూప్ -1 పరీక్షపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎక్కువగా అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేటలోని పలు కోచింగ్ కేంద్రాలలో గ్రూప్ -1కు సంబంధించి శిక్షణ తరగతులు ప్రారంభించాయి. గత నెల నుంచే కొత్త బ్యాచ్లు నడిపిస్తున్నాయి. గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడి తాజాగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మరిన్ని బ్యాచ్‌లు ప్రారంభించేందుకు కోచింగ్ సెంటర్లు కసరత్తు చేస్తున్నాయి. గ్రూప్1కు షార్ట్ టర్మ్ కోర్సు, క్రాష్ కోర్సు పేరిట ప్రత్యేకంగా మూడు నెలలకు తగినట్లుగా శిక్షణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కుర్చీలు, పుస్తకాలతో లైబ్రరీలలో ప్రిపరేషన్…

రాష్ట్రంలో ఉద్యోగాల ప్రకటన వెలువడటంతో గ్రంథాలయాలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రశాంతంగా చదువుకోవచ్చనే ఉద్ధేశంతో అభ్యర్థులు లైబ్రరీల బాటపడుతున్నారు. అయితే ఆయా లైబ్రరీలలో కుర్చీలు సరిపడా లేకపోవడంతో బయట నుంచి కుర్చీలు, పుస్తకాలు తీసుకుని వెళ్లి చదువుకుంటున్నారు. యూనివర్సిటీల లైబ్రరీలతో పాటు, నగరంలోని సిటీ సెంట్రర్ లైబ్రరీ, జిల్లా, పట్టణ కేంద్రాలలోని లైబ్రరీలు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. అయితే లైబ్రరీలలో వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నా అవి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి లేకపోవడంతో… సొంతంగా అవసరమైన పుస్తకాలను వెంట తెచ్చుకుంటున్నారు. ఎండాకాలం అయినప్పటికీ చెట్ల కింద, వరండాల్లో కూర్చుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి.. పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేయడంతోపాటు తాగునీరు, భోజన వసతుల కల్పనకు సహకారం అందిస్తున్నారు.

గ్రూప్-1కు తీవ్ర పోటీ…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లతో వెలువడిన గ్రూప్ -1 ఉద్యోగాలకు తీవ్ర పోటీ ఉండనుంది. రాష్ట్రంలో మొదటిసారిగా అత్యధికంగా 503 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దాదాపు అధిక శాతం అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకే ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో అధిక శాతం గ్రూప్ 1 కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 పరీక్షల విధానం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. ఇంటర్వూ మినహా మినతా పరీక్షలు ఒకేలా ఉంటాయి. సివిల్స్‌కు ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వూ అనే మూడు దశలు ఉంటే గ్రూప్ 1కు ప్రిలిమినరీ, మెయిన్స్ ఉంటాయి. ఈ పరీక్షల సిలబస్ కూడా ఇంచుమించు సరిమానంగా ఉంటుంది. దాంతో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో అధిక శాతం గ్రూప్ 1 కూడా సిద్ధం కానున్నారు. ఈ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలతో పాటు గ్రూప్ 1 సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News