టీచర్ పోస్టుల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం
పూర్తి కాని ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ
టెట్ నోటిఫికేషన్ వెలువడి ఏడాది పూర్తి
నోటిఫికేషన్ కోసం అభ్యర్థుల ఎదురుచూపులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీకి చేస్తామని గత ఏడాదే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా గత ఏడాది మార్చి 24వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ జారీ చేసి, జూన్ 12న పరీక్ష నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. అప్పటి నుంచి టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీచర్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, కొత్త టీచర్లను భర్తీ చేయకుండా, విద్యావలంటీర్లు లేకుండానే అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగిస్తున్నారు. సర్కారు బడుల్లో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే విద్యార్థులకు తగినట్లుగా ఉపాధ్యాయులు లేకపోతే బోధనపై ప్రభావం పడుతుంది. అయితే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే ఖాళీలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. అయితే టెట్ ఫలితాల తర్వాత సుమారు 10 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశించిన అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
వచ్చే విద్యాసంవత్సరానికి కొత్త టీచర్లు లేనట్లే
రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిసి జూన్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే జూన్ నాటికి కొత్త టీచర్ల భర్తీ జరిగే అవకాశం కనిపించడం లేదు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసి పోస్టులపై స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతనే నోటిఫికేషన్ వెలువడనుంది. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. అంటే మరో రెండు మూడు నెలల్లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టినా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు బోధించే అవకాశాలు ఉండదు. విద్యాసంవత్సరం మధ్యలో టీచర్ల నియామకం పూర్తయితే, ఆ తర్వాతి ఏడాదిలో కొత్త టీచర్లు బోధన చేపట్టే అవకాశం ఉంది.