Sunday, July 7, 2024

త్వరలోనే జాబ్ క్యాలెండర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను లోతుగా అధ్యయనం చేసి అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు. కెసిఆర్ ఐదేండ్లలో ఐదు లక్షల ఋణమాపి చేయలేకపోయాడని విమర్శించారు. రైతులు అప్పుల చేయకుండా సహాయం చేస్తున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ’ రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించడం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇప్పటికే అమలు చేయడం జరుగుతోందని భట్టి చెప్పారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు రైతు భరోసా అందించాలని పట్టుదలతో ఉన్నామనిచెప్పారు. ప్రభుత్వం రైతు భరోసా కోసం సబ్ కమిటీ కూడా వేసిందని గుర్తు చేశారు. ప్రజల ద్వారా కట్టిన పన్నులతో వచ్చిన ప్రతి పైసా వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉపయోగించాలని భాభిస్తుందన్నారు.

పాత పది జిల్లాల్లో వర్క్ షాపు పెడతామని, త్వరలో సబ్ కమిటీ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాయని తెలిపారు. రైతు భరోసా పై సబ్ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుంటుందని, కమిటీ రిపోర్ట్ ను అసెంబ్లీ లో చర్చకు పెడతామని, ప్రజలు కోరుకుంటే కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంపద సృష్టిస్తాం. ప్రజల అభీష్టం మేరకే సృష్టించిన సంపదను పంచుతామన్నారు. రైతే కాదు, ఎవరూ ఆత్మహత్య చేసుకున్నా అది దురదృష్టకరమని, రైతు ఆత్మహత్య వెనుక ఉన్నవాళ్లను వదిలిపెట్టమని భట్టి స్పష్టం చేశారు. ఖ్మ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే అంశంపై చాలా లోతుగా అత్యంత పకడ్బందీగా దర్యాప్తు జరుగుతోందని, కారఖులు ఎంతటివారైనా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయనన్నారు. రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిని విడిచిపెట్టమని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు కూడా ఈ ఘటన పూర్వాపరాలను పరిశోధన చేస్తున్నాయని తెలిపారు.

ఏడు మండలాల విలీన పాపం బిఆర్‌ఎస్, బిజెపిదే
ఈనెల 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని విభజన చట్టంలోని అంశాలు ఎజెండాగా ఉండబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇద్దరు సహచర ముఖ్యమంత్రులమే తప్పా గురు శిష్యులం కాదని రేవంత్ రెడ్డి ఇదివరకే చెప్పారని అయినా బురదజల్లేందుకే గురుశిష్యులు అని ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులని ఆయన చెప్పారు. విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం అంశం లేదని, బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్‌తో ఏడు మండలాలను ఎపిలో కి కలిపిందని తెలిపారు. ఏడు మండలాలు పోవడానికి కారణం బిఆర్‌ఎస్,బిజెపిలేనని ఆయనన్నారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కెసిఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. హరీష్ రావు కల్లబొల్లి మాటలను ఎవ్వరు నమ్మరని, పదేళ్లు అధికారంలో ఉండి బిఆర్‌ఎస్ చేసిందేమిలేదని ఆయనన్నారు. క్యాబినెట్ విస్తరణ పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, పిసిసి నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతోందని భట్టి అన్నారు. పదిహేనేండ్లు మేమే అధికారంలో ఉంటామని చెపుతున్న కెసిఆర్ వి కల్లిబొల్లు కబుర్లేనన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News