రెండేళ్లలో 33శాతం మహిళలకు ఉద్యోగాలు కల్పించాం
24 కంపెనీలు పాల్గొన్నాయి
నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: నగరంలోని నిరుద్యోగుల కోసమే జాబ్ మేళా నిర్వహిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నగర పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాల్‌లో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో చాలామంది నిరుద్యోగులగా మారారని తెలిపారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్లలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 33శాతం మహిళలకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. జాబ్‌మేళాలో 24 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. ఇప్పటి వరకు నగరానికి చెందిన 400మంది యువతి,యువకులకు ఉద్యోగాలు ఇప్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుల పాత్రమరువలేనిదని అన్నారు.
ప్రస్థుత ప్రపంచంలో గురువుకు ఉన్న అర్థం చాలామారిందని, ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. గత ఏడాదిన్నర నుంచి నగరం కరోనా, వరదలను ఎదొర్కొందని తెలిపారు. యువతి, యువకులు ముందుగా ఏదో ఒకజాబ్‌లో చేరాలని, తర్వాత స్కిల్‌ను పెంచుకుని పెద్ద కంపెనీల్లో చేరాలని కోరారు. ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ప్రతి ఏడాది కానిస్టేబుల్ ఆఫీసర్లు చేరుతున్నారని అన్నారు. వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రజలతో స్నేహంగా ఉండాలని, కేరీర్‌లో ముందుగా అనుమానాలు వస్తాయని, ప్రారంభంలో తప్పులు చేస్తారని, వాటిని సరిదిద్దు కోవాలని అన్నారు. ప్రజల సహకారంతో నగర రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశాభివృద్ధికి యువత కృషి చేయాలని కోరారు. టిఎంఐ గ్రూప్ చైర్మన్ మురళీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉద్యోగం చాలా ముఖ్యమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకుంటారని, అలాగే మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటారని అన్నారు. మొదటి సారిగా ఉద్యోగం పొందడం కష్టమని తర్వాత సులభంగా ఉద్యోగం పొందగలరని అన్నారు. పోలీసింగ్ ప్రజల బాగోగులను చూస్తుందని, అందరిని సమానంగా చూస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రానుల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి, జాయింట్ సిపి విశ్వప్రసాద్, రమణా రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.