Sunday, September 8, 2024

మరి పదేళ్లలో 9-5 పనివేళల జాబ్స్ కనుమరుగు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఎఐ) ప్రభావంతో 2034 కల్లా సాంప్రదాయక పనివేళలు (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) గల ఉద్యోగాలు కనుమరుగు అవుతాయని ప్రముఖ నెట్‌వర్కింగ్ వేదిక లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ జోస్యం చెప్పారు. ఎఐ కారణంగా గిగ్ ఎకానమీ విస్తరిస్తుందని, శాశ్వత ఉద్యోగమనే భావన తొలగిపోతుందని ఆయన సూచించారు. ప్రజలు ఒకేసారి వివిధ సంస్థలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని పని చేసే సంప్రదాయం వేళ్లూనుకుంటుందని ఆయన అంచనా వేశారు.

మరొక వైపు రీడ్ హాఫ్‌మన్ వ్యాఖ్యలను నెట్టింట పంచుకున్న ఎంట్రపెన్యూర్ నీల్ టపారియా భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో హాఫ్‌మన్ జోస్యాలన్నీ నిజమయ్యాయని ఆయన గుర్తు చేశారు. 1997లోనే హాఫ్‌మన్ సోషల్ మీడియా ఆధిపత్యాన్ని ఊహించారని, ఎయిర్ బిఎస్‌బి వంటి షేరింగ్ సర్వీసులు పెరుగుతాయని ఆయన అంచనా వేశారని టపారియా తెలియజేశారు. చాట్‌జిపిజి ఉనికిలోకి రాక ముందే ఎఐ విప్లవం గురించి హాఫ్‌మన్ సూచించినట్లు ఆయన తెలిపారు. హాఫ్‌మన్ తాజా అంచనాలు కూడా నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని టపారియా అన్నారు.

చాట్‌ జిపిజి మార్కెట్‌లో కాలు పెట్టిన స్వల్ప వ్యవధిలోనే వేగంగా విస్తరించిందని, ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ ఉద్యోగాలు నిరుపయోగంగా మారిపోయాయని టపారియా తెలియజేశారు. ఇది ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రాబోయే రోజుల్లో శాశ్వత ఉద్యోగాల కంటే ఫ్రీలాన్సర్లే అధికంగా ఆర్జిస్తారని ఆయన అంచనా వేశారు. రెజ్యూమేలు, సివిలు వంటి సాంప్రదాయక జాబ్ దరఖాస్తులను ఎవరూ ఉపయోగించరని టపారియా సూచించారు. మరొక వైపు, హాఫ్‌మన్‌తో పాటు గతంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్ఛిన్నకర ఎఐ ప్రభావాల గురించి హెచ్చరించారు. గిగ్ ఎకానమీతో ఉద్యోగులకు మరింత స్వేచ్ఛ లభించినా ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News